మద్యానికి బానిసై.. భార్యను అనుమానిస్తూ..!

22 Oct, 2019 06:59 IST|Sakshi

పోలీసుల కంటపడకుండా ఖననం  

సమాచారంతో విచారణ చేపడుతున్న పోలీసులు  

పరారీలో నిందితుడు  

సాక్షి, నాయుడుపేట : నిత్యం మందు ముట్టనిదే నిద్రపట్టని పరిస్థితి. భయం, బెరుకూ లేకుండా కుటుంబ సభ్యుల ముందే మద్యం సేవించడం అతగాడి నైజం. ఈ క్రమంలో నాయుడుపేట మండలం మేనకూరు పంచాయతీ వద్దిగుంట కండ్రిగ గ్రామానికి చెందిన పుట్టా మునిరాజ మద్యం సేవించి తన భార్య ప్రమీల (29)ను విచక్షణా రహితంగా కత్తితో నరికి హతమార్చిన ఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వద్దిగుంట కండ్రిగ గ్రామానికి చెందిన గోవిందయ్య కుమారుడు మునిరాజ నిత్యం మద్యం సేవిస్తుండేవాడు. మద్యానికి బానిసై భార్యను అనుమానిస్తూ నిత్యం వేధించేవాడు. ఆదివారం రాత్రి మద్యం సేవించి తనవెంట మరో రెండు మద్యం బాటిళ్లను కూడా వెంట తెచ్చుకున్నాడు. ఇంటి సభ్యుల ముందే మద్యం సేవించాడు.

తన ఇద్దరు కుమార్తెలు నిద్రపోయిన తరువాత రాత్రి పదిన్నర సమయంలో భార్య ప్రమీల వాష్‌ రూమ్‌కి ఇంటి బయటకు వెళ్లిరావడంతో అనుమానించిన భర్త కర్కశంగా కత్తితో నరికి చంపేశాడు. ఎలాగైనా భార్యను కంటికి కనపడకుండా చేసేందుకు గోనెసంచిలో వేసి నిప్పంటించేందుకు ప్రయతత్నించాడు. ఇంతలో స్థానికులు గుర్తించడంతో భార్యను చంపేసిన విషయాన్ని తన చెల్లెలు మల్లీశ్వరికి చెప్పి వస్తానంటూ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు మృతిచెందిన ప్రమీల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే హత్య ఉదంతం పోలీసులకు తెలియనియ్యకుండా గోప్యంగా దహన సంస్కారాలు పూర్తి చేశారు. అనంతరం సమాచారం అందుకున్న నాయుడుపేట ఎస్సై వెంకటేశ్వరరావు సోమవారం సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలను ఆరాతీశారు. భార్యను హత్య చేసిన విషయం వాస్తవమేనని స్థానికులు, కుటుంబ సభ్యులు తెలపడంతో పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. 

వద్దిగుంట కండ్రిగలో విషాదఛాయలు 
భార్య ప్రమీలను హతమార్చి పరారైన సంఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తమ పిల్లలు తల్లిని కోల్పోయిన బాధలో శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే ప్రమీలను ఉన్నఫలంగా హతమార్చడంపై అయ్యోపాపం అంటూ గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా