పెళ్లి చేసుకున్నాడు.. వదిలేశాడు!  

3 Aug, 2019 09:03 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితురాలు  

న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన వివాహిత  

సాక్షి, పెళ్లకూరు: ప్రేమించానంటూ వెంట పడ్డాడు. పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించాడు. చివరకు కులాలు పట్టింపు లేదంటూ నమ్మించాడు. తల్లిదండ్రులు చేరదీయకపోయినా కడవరకు తోడుంటానంటూ మెడలో మూడు ముళ్లు వేసి కులాంతర వివాహం చేసుకున్నాడు. నాలుగు నెలలకే వదిలేసి వెళ్లాడని, తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ శుక్రవారం న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు.. మండలంలోని అనకవోలు దళితకాలనీకి చెందిన దగ్గోలు స్వర్ణలతను కే.జంగాలపల్లికి చెందిన మంగానెల్లూరు మణిబాబు రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. వృద్ధురాలైన తల్లికి ఆసరాగా ఉంటున్న స్వర్ణలత తొలుత మణిబాబు ప్రేమను తిరస్కరించింది.

ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మణిబాబు చెప్పడంతో ఎట్టకేలకు ప్రేమించింది. ఇద్దరి అంగీకారంతో జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో నాలుగు నెలలు కిందట రహస్యంగా వివాహం చేసుకున్నారు. నెల్లూరు ఎన్‌టీఆర్‌ నగర్‌లో నాలుగు నెలలు సంతోషంగా కాపురం ఉన్నారు. ఇటీవల మణిబాబు తల్లిదండ్రులు, బంధువులు మాయమాటలు చెప్పడంతో తనను ఒంటరిగా వదిలి వెళ్లాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయడంతో జంగాలపల్లి గ్రామానికి వెళ్లి విచారించగా మణిబాబును కనబడకుండా దాచిన బంధువులు, తక్కువ కులం అంటూ దుర్భాషలాడి గెంటేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసులను కోరింది.      

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు