క్షణికావేశం.. భార్య ప్రాణాలు తీసింది!

4 Aug, 2019 13:45 IST|Sakshi
హత్యకు గురైన పద్మావతమ్మ, (ఇన్‌సెట్లో) తులసీదాస్‌   

వృద్ధాప్యంలో భార్యాభర్తల మధ్య  కౌలు డబ్బు చిచ్చు

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

సాక్షి, కోసిగి: వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన భార్య, భర్త మధ్య కౌలు డబ్బు చిచ్చు పెట్టింది. పొలం కౌలు డబ్బు కూతుళ్లకు ఇవ్వడమే గాక తనను ఏమాత్రమూ పట్టించుకోవడం లేదనే కోపంతో సొంత భార్యనే గొడ్డలితో నరికి హత్య చేశాడు. మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన వివరాలు.. గ్రామానికి చెందిన తులసీదాస్, దాసరి పద్మావతమ్మ(64) దంపతులకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు కావడంతో ఆస్తి పంపకాలు కూడా పూర్తి చేసేశారు. 27 ఎకరాల పొలంలో ముగ్గురు కుమారులకు 8 ఎకరాల చొప్పున పంపిణీ చేసి, మిగతా 3 ఎకరాలు తమ వద్దే ఉంచుకున్నారు. ఆ పొలాన్ని కౌలుకు ఇచ్చి ఆ డబ్బుతో వృద్ధ దంపతులు జీవనం సాగించేవారు.

కాగా ఇటీవల పద్మావతమ్మ తరచూ కూతుళ్ల వద్దకు వెళ్తూ అక్కడే ఎక్కువ కాలం గడుపుతుండటం, కౌలు డబ్బు కూడా వారికే ఇస్తుండటంతో తులసీదాస్‌ వ్యతిరేకిస్తూ ఉండేవాడు. ఈ విషయమై తరచూ గొడవ పడేవాడు. కూతురి ఇంటి నుంచి రెండు రోజుల క్రితమే పద్మావతమ్మ భర్త వద్దకు వచ్చింది. శుక్రవారం రాత్రి మరోసారి గొడవ పడ్డారు. అనంతరం నిద్రకు ఉపక్రమించారు. మధ్య రాత్రి తులసీదాస్‌ విచక్షణా రహితంగా గొడ్డలితో భార్యపై దాడి చేశాడు. తల, కాళ్లపై నరికి హత్య చేశాడు. అలికిడికి సమీప ఇంట్లో ఉన్న కుమారుడు లేచి చూసేసరికి తల్లి రక్తపు మడుగులో పడి ఉండటంతో వెంటనే కోసిగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ శ్రీనివాసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతురాలి కుమారుడు దాసరి లక్ష్మన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా