హైదరాబాద్‌లో క్రైమ్‌రేటు తగ్గింది : సీపీ

26 Dec, 2018 14:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గతేడాదితో పోలిస్తే 2018లో నగరంలో క్రైమ్‌ రేటు 6 శాతం తగ్గిందని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన సంవత్సరాంతపు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది నమోదైన కేసులు, వాటిని ఛేదించిన తీరు, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగడంలో పోలీసుల పాత్ర తదితర వివరాలను వెల్లడించారు.

క్రైమ్‌ రేటు తగ్గింది....
గతేడాదితో పోలిస్తే ప్రాపర్టీ క్రైమ్‌లో 20 శాతం, వరకట్న చావులు 38 శాతం, కిడ్నాప్‌ కేసులు 12 శాతం, లైంగిక వేధింపుల కేసుల్లో 7 శాతం తగ్గిందని సీపీ అంజనీ కుమార్‌ పేర్కొన్నారు. అయితే మర్డర్‌ కేసులు మాత్రం 2017తో పోలిస్తే 8 శాతం పెరిగాయని తెలిపారు. ఈ ఏడాది సొత్తు  92 శాతం సొత్తు రికవరీ సాధించగలిగామన్నారు. ఎన్నికల సమయంలో 29 హవాలా సొత్తుని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 4777 గన్ లైసెన్స్‌లకు, సిటీ లో ఉన్న 2లక్షల 48వేల 528 సీసీటీవీలకు జియో టాగింగ్ చేసినట్లు పేర్కొన్నారు. కరడుగట్టిన నేరస్తులపై 2017లో 53 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తే ఈ ఏడాది102 మంది మీద నమోదు చేశామని పేర్కొన్నారు.

వుమెన్‌ ఆన్‌ వీల్స్‌ ఉపయోగపడింది
షీటీమ్స్ భరోసా సెంటర్లలో 1028 కేసులు నమోదు చేశామని సీపీ పేర్కొన్నారు. ఆకతాయిల ఆట కట్టించడంలో, నేరాలను తగ్గించడంలో వుమెన్‌ ఆన్ వీల్స్ , వెరీ ఫాస్ట్ యాప్‌ ఫేషియల్ రికగ్నైజేషన్‌ సిస్టం ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు. 2018లో మొట్టమొదటిసారిగా 40 మంది పోలీసులతో సిటీ రాపిడ్‌ యాక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో 20 మర్డర్ కేసులు ఛేదించినట్లు తెలిపారు. 101 మంది క్రికెట్ బూకీలను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఆ కేసుల్ని తక్కువ సమయంలో ఛేదించాం
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నిజాం మ్యూజియంలో చోరీ కేసు, కోఠి ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ కేసు అతి తక్కువ సమయంలో ఛేదించామని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వీవీఐపీల సందర్శన, రాష్ట్రపతి రాక, పర్వదినాలకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు తదితర సమయాల్లో సమర్థవంతంగా పని చేశామన్నారు. ఎన్నికల సమయంలో 29 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

రెండు అవార్డులు సాధించాం
2018 సంవత్సరానికి గాను స్మార్ట్ సిటీ అవార్డు ,ఈ- గవర్నెన్స్ అవార్డులను హైదరాబాద్ పోలీస్ శాఖ సాధించిందని సీపీ హర్షం వ్యక్తం చేశారు. వివిధ దేశాల ప్రతినిధులు హైదరాబాద్ పోలీసుల పనితీరుపై అధ్యయనం చేసేందుకు నగరానికి వచ్చారన్నారు. ట్యాంక్‌బండ్‌లో ఆత్మహత్య చేసుకోడానికి వచ్చిన 336 మందిని లేక్ పోలీసులు కాపాడారని తెలిపారు. ఇక గతేడాదితో పోలిస్తే చైన్ స్నాచింగ్ కేసులు 62 శాతం తగ్గాయని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై 26779 కేసులు నమోదు కాగా.. 1368 మంది లైసెన్స్ రద్దు అయినట్లు తెలిపారు. మొత్తంగా 26407 చార్జిషీట్లు నమోదు కాగా... 5148 మందికి జైలు శిక్ష పడిందని.. జరిమానా రూపంలో ఐదు కోట్ల రూపాయలు వసూలు అయ్యాయని వెల్లడించారు.

మరిన్ని వార్తలు