ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రేమయాణం

20 Mar, 2019 12:04 IST|Sakshi
నిందితుడు పవన్‌చైతన్య

బాలికను కిడ్నాప్‌ చేసిన విజయనగరం యువకుడు

స్కూల్‌ నుంచి తీసుకెళ్లిన వైనం

డీజీపీ జోక్యంతో     కొలిక్కివచ్చిన కేసు

హిమాయత్‌నగర్‌: ఆ బాలిక వయస్సు 13 సంవత్సరాలు. అబ్బాయి వయస్సు 22 సంవత్సరాలు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. సదరు బాలికకు మాయమాటలు చెప్పిన యువకుడు ఈ నెల 15న స్కూల్‌ నుంచి ఆమెను కిడ్నాప్‌ చేశాడు. దీనిపై అదే రోజు సాయంత్రం  నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. హిమాయత్‌నగర్‌లో అదృశ్యమైన బాలిక విజయనగరం జిల్లా బొబ్బిలిలో ప్రత్యక్షమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి..అంబర్‌ పేట్‌కు చెందిన బాలిక(13) హిమాయత్‌నగర్, స్ట్రీట్‌నెంబర్‌–14లోని ఓ ప్రైవేట్‌ స్కూల్లో 8వ తరగతి చదువుతుంది. ఇదే స్కూలుకు చెందిన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రూప్‌ చాటింగ్‌ చేసేది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం విజయనగరం ప్రాంతానికి  చెందిన పవన్‌చైతన్య అనే యువకుడితో ఇన్‌స్ట్రాగామ్‌లో ఆమెకు పరిచయం ఏర్పడింది. హీరో నాగచైతన్య ఫ్యాన్‌నని చెప్పుకున్న పవన్‌ చైతన్య సదరు బాలికతో చాటింగ్‌ చేసేవాడు. ఆమె కూడా  నాగచైతన్య అభిమాని కావడంతో ఇద్దరూ స్నేహితులు అయ్యారు. స్నేహం కొద్ది రోజులకు ప్రేమగా మారింది. అర్థరాత్రి వరకు చాటింగ్, ఫోన్‌లతో బిజీగా గడిపేవారు. 

స్కూల్‌ నుంచి కిడ్నాప్‌...
కొద్ది రోజుల అనంతరం విజయనగరానికి రావాలని పవన్‌చైతన్య కోరడంతో బాలిక తిరస్కరించింది. ‘నేను నీ కోసం హైదరాబాద్‌ వస్తే కూడా రావా’? అనడంతో వస్తానంటూ బదులిచ్చింది. అంతే ఈ నెల 15న స్కూల్‌ వద్దకు వచ్చిన పవన్‌చైతన్య ఆమెను తీసుకుని పరారయ్యాడు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌ వెళ్లిన వారు రైతులో బొబ్బిలికి వెళ్లారు. బొబ్బిలిలో పవన్‌చైతన్య బంధువుల ఇంట్లో ఉన్న వీరిని స్థానిక పోలీసులసాయంతో నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

డీజీపీ జోక్యంతో కొలిక్కి..
తమ కుమార్తె కనిపించడం లేదని అదే రోజు బాలిక తల్లిదండ్రులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ఎస్‌ఐ.సైదులు, ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్‌ నేతృత్వంలో గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో తల్లిదండ్రులు డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి సమస్య చెప్పడంతో స్పందించిన ఆయన కేసును వెంటనే చేధించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్‌ నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు..సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా పవన్‌ చైతన్యను గుర్తించారు. వారిని తీసుకొచ్చేందుకు ఎస్‌ఐ సైదులు, సిబ్బంది బొబ్బిలి బయలుదేరి వెళ్లారు. 

మరిన్ని వార్తలు