అడ్డొస్తున్నాడనేనా..?

13 Dec, 2019 10:03 IST|Sakshi
నాగరాజు (ఫైల్‌)

వివాహేతర సంబంధం కారణంగా వ్యక్తి హత్య

బీదర్‌కు తీసుకెళ్లి దారుణం

పోలీసుల అదుపులో నిందితుడు

మృతుడి భార్యపై అనుమానం

నిజాంపేట్‌: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ఆమె భర్తకు మాయమాటలు చెప్పి కర్నాటకలోని బీదర్‌ పరిసరాలకు తీసుకెళ్లి హత్య చేసినట్లు తెలిసింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రగతినగర్‌ ప్రాంతంలో ఉంటున్న నాగరాజు(35), హేమలత దంపతులు స్థానిక ఎలీప్‌ పారిశ్రామికవాడలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కృష్ణాజిల్లా, బొమ్మలపాడుకు చెందిన నాగరాజు 12 ఏళ్ల క్రితం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చాడు. తొలుత ప్రగతినగర్, ప్రశాంతి గోల్డెన్‌ హిల్స్‌లో ఉంటున్న రిటైర్డ్‌ ఉద్యోగి వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో  వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో హేమలతతో వెంకటేశ్వరెడ్డికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిని గుర్తించిన నాగరాజు ఎలీప్‌ పారిశ్రామికవాడకు మకాం మార్చాడు. అయినా వారి మధ్య సంబంధం కొనసాగుతుండటంతో మద్యానికి బానిసైన నాగరాజు తరచూ భార్యను కొట్టేవాడు.

నమ్మించి తీసుకెళ్లి..
ఈ నెల 10న ఇంటి నుంచి బయటికి వెళ్లిన నాగరాజును వెంకటేశ్వర రెడ్డి నమ్మించి తనతో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అతడికి మద్యం తాగించి కారులో బీదర్‌ సమీపంలోని బాల్కి ప్రాంతానికి తీసుకెళ్లాడు. 11న హేమలత భర్త ఇంటికి రాకపోవడంతో పరిసరాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో నేరుగా వెంకటేశ్వర రెడ్డి ఇంటికి వెళ్లి అడిగింది. అయితే అతను తన వద్దకు రాలేదని చెప్పాడు.  ఈ విషయాన్ని హేమలత  స్థానికులకు చెప్పడంతో  నాగరాజు వెంకటేశ్వర రెడ్డితో కలిసి వెళుతుండగా చూసినట్లు తెలిపారు. దీంతో బుధవారం మధ్యాహ్నం హేమలత తన బంధువులతో కలిసి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వెంకటేశ్వర రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నాగరాజును బీదర్‌ తీసుకెళ్లి హత్య చేయడమేగాక పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు తెలిపాడు. 

హేమలతపై అనుమానం..?
వెంకటేశ్వరరెడ్డి, హేమలత మధ్య వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నందునే నాగరాజు హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్వరెడ్డి ఘటనకు ఐదు రోజుల ముందు నుంచే తన అపార్ట్‌మెంట్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాలను ఆఫ్‌ చేయించి ఉండటంతో పథకం ప్రకారం ఈ హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హేమలత, వెంకటేశ్వర రెడ్డి ఇద్దరూ కలిసి ఈ హత్యకు కుట్ర పన్నారా..? లేదా వెంకటేశ్వర రెడ్డి హేమలతకు తెలియకుండానే నాగరాజును హత్య చేశాడా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 

బీదర్‌కు ప్రత్యేక బృందం..
నాగరాజు హత్యకు గురైనట్లు తెలియడంతో పోలీసులు బుధవారం రాత్రి బీదర్‌ సమీపంలోని ఘటనా స్థలానికి  బయలు దేరి వెళ్లారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తిరుగు ప్రయాణమైనట్లు తెలిసింది. కాగా మృతుడి భార్య హేమలత ప్రస్తుతం బాచుపల్లి పోలీసుల అదుపులో ఉంది.  

మరిన్ని వార్తలు