‘ఉగ్ర నిధుల’ కేసులో హైదరాబాదీ!

27 Feb, 2019 02:44 IST|Sakshi
సలీం, సల్మాన్‌ , సజ్జద్‌

దుబాయ్‌లో ఉన్న పాకిస్తానీతో సంబంధాలు 

గత ఏడాది కేసు నమోదు చేసిన ఢిల్లీ ఎన్‌ఐఏ 

విచారణకు హాజరుకావాలంటూ మన్సూరీకి ఆదేశం 

కొంత సమయం కోరిన నగర వ్యాపారవేత్త

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ మహ్మద్‌ సయీద్‌కు చెందిన సంస్థ జమాత్‌ ఉల్‌ దవాకు (జేయూడీ) మరో రూపంగా ఏర్పడిన నిషిద్ధ ఫల్హాహ్‌ ఇ ఇన్సానియత్‌ ఫౌండేషన్‌ (ఎఫ్‌ఐఎఫ్‌) నిధుల కేసులో ఢిల్లీ ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌కు చెందిన ఓ యువ వ్యాపారికి నోటీసులిచ్చారు. ఈ కేసులో వాంటెడ్‌గా ఉన్న పాకిస్తానీతో సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై బహదూర్‌పురాకు చెందిన మన్సూరీని సోమవారం విచారణకు హాజరుకావాలని ఢిల్లీ ఎన్‌ఐఏ యూనిట్‌ ఆదేశించింది. అయితే ఆయన కొంత సమయం కోరారని, దీంతో అనుమతినిచ్చిందని ఓ అధికారి పేర్కొన్నారు. పీఓకేలో మంగళవారం జరిగిన సర్జికల్‌ దాడుల నేపథ్యంలో అత్యంత అప్రమత్తత కొనసాగుతుండగా ఈ విషయం వెలుగులోకి రావడం కలకలం రేపింది. పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ మద్దతుతో హఫీజ్‌ సయీద్‌ కో–ఫౌండర్‌గా ఏర్పాటు చేసిన లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) సంస్థ హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా అనేక ఉగ్రవాద చర్యలకు పాల్పడింది. నగరంలో 2001లో గణేష్‌ ఉత్సవాల సందర్భంగా పేలుళ్లకు కుట్ర, 2002లో దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుడు, 2004, 2005లో విధ్వంసాలకు కుట్రతో పాటు 2008 నాటి ముంబై మారణహోమం వరకు ఎల్‌ఈటీ దారుణాలెన్నో ఉన్నాయి. ఎల్‌ఈటీని నిషేధించడంతో సయీద్‌ జేయూడీకి రూపమిచ్చాడు. దీని ద్వారా ఆపరేషన్స్‌ చేయడం మొదలుపెట్టాడు. దీనిపైనా నిషేధం విధించడంతో స్వచ్ఛంద సంస్థ అంటూ ఎఫ్‌ఐఎఫ్‌ నెలకొల్పాడు. దీన్ని అమెరికా 2010లో ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ బ్యాన్‌ చేసింది. 

ఐఎస్‌ఐ నుంచి నిధులు... 
అప్పటి నుంచి చాప కింద నీరులా కార్యకలాపాలు సాగిస్తున్న ఎఫ్‌ఐఎఫ్‌ అనేక దుశ్చర్యలకు పురిగొల్పిందన్న ఆరోపణలున్నాయి. ఈ సంస్థకు అవసరమైన నిధుల్ని ఐఎస్‌ఐ సమకూరుస్తోంది. ఇవి నేరుగా భారత్‌కు రాకుండా దుబాయ్‌ మీదుగా మళ్లిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. వీటిని అందుకోవడంలో, ఎఫ్‌ఐఎఫ్‌ క్యాడర్‌కు అందించడంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర హోం శాఖకు (ఎంహెచ్‌ఏ) నిఘా వర్గాలు గత ఏడాది సమగ్ర నివేదికను అందించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎంహెచ్‌ఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఎన్‌ఐఏను ఆదేశించింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీ యూనిట్‌ ఓ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఫలితంగా ఈ నిధులు హవాలా రూపంలో వస్తున్నాయని వెలుగులోకి వచ్చింది. ఎఫ్‌ఐఎఫ్‌ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై కొందరిని అనుమానితులుగా నిర్ధారించింది.

ఆ వివరాల ఆధారంగా గత ఏడాది సెప్టెంబర్‌ 26న ఢిల్లీతో పాటు శ్రీనగర్‌లోనూ ఏకకాల దాడులు చేసింది. ఢిల్లీకి చెందిన మహ్మద్‌ సల్మాన్, దుర్యాగంజ్‌ వాసి మహ్మద్‌ సలీమ్, శ్రీనగర్‌కు చెందిన సజ్జద్‌ అబ్దుల్‌ వనీలను అరెస్టు చేసింది. వీరి విచారణలోనే రాజస్తాన్‌లోని నాగౌర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ మూలానీ అలియాస్‌ బబ్లూ పాత్ర వెలుగులోకి వచ్చింది. బబ్లూను అరెస్టు చేసి విచారించగా దుబాయ్‌లో ఉంటున్న పాకిస్తానీ కమ్రాన్‌ తన సొంత దేశం నుంచి నిధులు సేకరించి భారత్‌కు పంపిస్తున్నట్లు తెలిసింది. ఇతడి పూర్వాపరాలు, వ్యవహార శైలి, లింకుల్ని ఎన్‌ఐఏ లోతుగా అధ్యయనం చేసింది. దీంతో హైదరాబాద్‌కు చెందిన మన్సూరీ పాత్ర వెలుగులోకి వచ్చింది. బహదూర్‌పురాకు చెందిన ఇతను కమ్రాన్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడని అనుమానించాయి. దీంతో ఢిల్లీ ఎన్‌ఐఏ యూనిట్‌లో ఎస్పీగా పని చేస్తున్న విశాల్‌ గర్గ్‌ ఈ నెల 19న మన్సూరీకు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఢిల్లీలోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. దీన్ని అందుకున్న మన్సూరీ తనకు కొంత సమయం కావాలంటూ మంగళవారం ఎన్‌ఐఏను కోరినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు