డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. తాగకున్న తాగినట్టు!

26 Aug, 2018 20:05 IST|Sakshi
ఇన్‌సెట్‌ రీడింగ్‌ చూపిస్తున్న బాధితుడు

సాక్షి, హైదరాబాద్: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఆసక్తికర విషయం బట్టబయలైంది. మద్యం సేవించని ఓ యువకుడికి 43 శాతం ఆల్కహాల్‌ సేవించినట్లు రీడింగ్‌ వచ్చింది. దీంతో ఆ యువకుడు అవాక్కయ్యాడు. ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం అతనిపై కేసు నమోదు చేశారు. సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

సయ్యద్‌ జహిరూల్లా ఖాద్రి(20) గత శనివారం రాత్రి రాంకోఠి మీదుగా తన ఇంటికి వెళ్తుండగా సుల్తాన్‌ బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో భాగంగా అతన్ని ఆపి తనిఖీ చేశారు. అయితే జహిరుల్లా 43 శాతం మధ్యం సేవించినట్లుగా రీడింగ్‌ రావడంతో పోలీసులు అతని ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. తనకు అసలు మద్యం అలవాటే లేదని, కావాలంటే వైద్యపరీక్షలు నిర్వహించాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆవేదన గురైన జహిరుల్లా సుల్తాన్‌బజార్‌ లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులను ఆశ్రయించాడు. తనను అన్యాయంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఇరికించారని ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. మెడికల్‌ రిపోర్ట్‌లో జహిరుల్లా మద్యం సేవించలేదని తేలడంతో పోలీసులు అవాక్కయ్యారు. ట్రాఫిక్‌ పోలీసులు తనను ఉద్దేశ్యపూర్వకంగా కేసులో ఇరికించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు