సోషల్‌ మీడియాపై నజర్‌ 

30 May, 2018 09:32 IST|Sakshi

‘పుకార్ల ఉదంతాల‘పై రెండు కేసులు నమోదు 

ముగ్గురిని నిందితులుగా గుర్తించిన పోలీసులు 

సూత్రధారి అరెస్టుకు రంగం సిద్ధం 

వెబ్‌ చానల్స్‌ వ్యవహారశైలిపై సమగ్ర అధ్యయనం

సాక్షి, సిటీబ్యూరో : నగరంలో ఉద్రిక్తతలు, అమాయకులపై దాడులకు ప్రధాన కారణంగా మారుతున్న సోషల్‌ మీడియా పుకార్లను సిటీ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. వీటికి బాధ్యులను గుర్తించడానికి సోషల్‌ మీడియాపై నిఘా ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ముగ్గురు బాధ్యులను గుర్తించి, వారిపై రెండు కేసులు నమోదు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. సుమోటోగా నమోదు చేసిన ఈ రెండింటినీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ప్రధాన సూత్రధారిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గత రెండు రోజులుగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఫేస్‌బుక్‌పై దృష్టి పెట్టారు.

దీంతో అషిఖ్‌ అహ్మద్‌ అనే పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతా ఉన్న వ్యక్తి సోమవారం హబీబ్‌నగర్‌ ఠాణా పరిధిలోని అఫ్జల్‌సాగర్‌లో జరిగిన గొడవను లైవ్‌ చేశాడు. ఆ ప్రాంతంలో చిత్తుకాగితాలు ఏరుకునే యువతిని కిడ్నాపర్‌గా భావించిన స్థానికులు దాడికి ప్రయత్నించారు. దీనిని వక్రీకరించిన అషిఖ్‌ కిడ్నాపర్‌ చిక్కిందని, స్థానికులు దేహశుధ్ధి చేస్తున్నారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు జోడించాడు. దీనిని సారస్వత్‌ జూషణ్‌ అనే పేరుతో ఖాతా నిర్వహిస్తున్న వ్యక్తి షేర్‌ చేస్తూ మరికొన్ని వ్యాఖ్యలు జోడించాడు. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి వీరిద్దరిపై కేసు నమోదైంది. మరోపక్క అఖిసింగ్‌ పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతా నిర్వహిస్తున్న మరోపక్క జోలెపట్టుకుని ఉన్న ఓ వ్యక్తిపై కొందరు దాడి చేస్తున్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ కిడ్నాపర్‌ అంటూ కామెంట్‌ చేయడంతో ఇతడిపై మరో కేసు నమోదు చేశారు.

అషిఖ్‌ను సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశారు. శనివారం అర్ధరాత్రి చంద్రాయణగుట్టలో చోటు చేసుకున్న ఉదంతంలో వెబ్‌చానల్స్‌ అత్యుత్సాహం సైతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఇద్దరిని ఆ కేసులో నిందితులుగా చేర్చి చర్యలు తీసుకున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు వెబ్‌చానల్స్‌ నిర్వహణ, పని విధానం, తీరు తెన్నులపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి త్వరలో ఓ సమగ్ర బ్లూప్రింట్‌ రూపొందిస్తామని, నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సీపీ వివరించారు. 

మరిన్ని వార్తలు