‘గుట్కా’ గుట్టుపై గుజరాత్‌కు సమాచారం!

8 May, 2019 08:11 IST|Sakshi
గుట్కా ప్యాకెట్లను పరిశీలిస్తున్న సీపీ అంజనీకుమార్‌ తదితరులు (ఫైల్‌) అభిషేక్‌ (ఫైల్‌)

అక్కడి పోలీసులకు లేఖ రాయాలని నిర్ణయం

అభిషేక్‌ కేసులో లోతుగా సాగుతున్న దర్యాప్తు

నెలకు రూ.30 లక్షలు ఖర్చు చేసినట్లు గుర్తింపు

సాక్షి, సిటీబ్యూరో: పాన్‌ మసాలా పేరుతో నిషేధిత ‘గుట్కా’ దందా చేస్తున్న ముఠా సూత్రధారి అవల అభిషేక్‌ వ్యవహారాన్ని నగర పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇతడు గుజరాత్‌ కేంద్రంగా సాగిస్తున్న దందాకు సంబంధించిన సమాచారాన్ని అక్కడి పోలీసులకు తెలపాలని నిర్ణయించారు. మరోపక్క ఫ్రాంచైజీల పేరుతో ఇతడి చేతిలో మోసపోయిన అనేక మంది హైదరాబాద్‌కు క్యూ కడుతుండటంతో అభిషేక్‌ ఆర్థిక లావాదేవీల పైనా పోలీసు విభాగం కన్నేసింది. సైదాబాద్‌ ప్రాంతానికి చెందిన అవల అభిషేక్‌ 2015లో బీబీనగర్‌ సమీపంలోని నేమర గోముల గ్రామంలో ‘7 హిల్స్‌ మాణిక్‌చంద్‌’ పేరుతో పాన్‌ మసాల, జర్దా ఉత్పత్తి చేసే సంస్థను ఏర్పాటు చేశాడు. గత ఏడాది దీనిపై దాడి చేసిన బీబీ నగర్‌ పోలీసు అవినాష్‌తో పాటు అతడి తండ్రి ఏవీ సురేష్, మరో నలుగురిని అరెస్టు చేశారు. దీంతో అతను తన అడ్డాను గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్‌లకు మార్చి అక్కడ యూనిట్స్‌ ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోనూ గుట్కాపై నిషేధం విధించడంతో అభిషేక్‌ తన యూనిట్స్‌లో గుట్కాను అదే రూపంలో ఉత్పత్తి చేయలేదు. పోలీసుల కన్నుగప్పేందుకు ‘7 ఎంసీ టుబాకో’ పేరుతో ఒకటి, ‘7 హిల్స్‌ మాణిక్‌చంద్‌ పాన్‌ మసాల’ పేరిట మరోటి తయారు చేస్తున్నాడు.

ఈ రెంటినీ వేర్వేరుగా ప్యాక్‌ చేసి వివిధ ప్రాంతాలకు అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో సోమవారం నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి అతడిని అరెస్టు చేశారు. గుజరాత్‌ పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా సాగుతున్న ఈ దందాను వారి దృష్టికి తీసుకువెళ్ళాలని నగర పోలీసులు నిర్ణయించారు. ఇందుకుగాను అక్కడి పోలీసులకు లేఖ రాయనున్నారు. తద్వారా గుజరాత్‌లో ఉన్న అభిషేక్‌కు చెందిన యూనిట్స్‌ను సీజ్‌ చేయించాలని, దీంతో అతడి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం అవినాష్‌ ముఠాను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు గోపాలపురం పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో వారే సంబంధిత అధికారుల ద్వారా లేఖ రాసే అవకాశం ఉంది. అవినాష్‌ ఓ పక్క నిషేధిత ఉత్పత్తుల దందా చేస్తూనే మరోపక్క అనేక మందిని మోసం చేశాడు. ‘7 హిల్స్‌ మాణిక్‌చంద్‌ పాన్‌ మసాల’ ఉత్పత్తులకు సంబధించిన ఫ్రాంచైజీలు, డిస్ట్రిబ్యూషన్స్, సీ అండ్‌ ఎఫ్‌ ఏజెన్సీలు ఇస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. పాన్‌ మసాలాల విక్రయంపై నిషేధం లేకపోవడంతో ఎవరి వారు వీటిని తీసుకోవడానికి ఆసక్తి చూపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిస్సా, కోల్‌కతా, ఢిల్లీ తదితర నగరాలకు చెందిన పలువురు అతడిని సంప్రదించారు. వారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో రూ.లక్షలు, రూ.కోట్లలో వసూలు చేసి మోసం చేశాడు.

దీనిపై ఇప్పటికే ముషీరాబాద్, ఏపీలోని విశాఖపట్నం ప్రాంతాల్లో ఇతడిపై కేసులు నమోదు కాగా మంగళవారం బీహార్‌లోని పట్నా, ఢిల్లీలకు చెందిన దీలీప్‌ చౌదరి, మోహన్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అభిషేక్‌ తమ నుంచి దాదాపు రూ.3.5 కోట్ల మేర తీసుకుని మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిన్నింటితో పాటు అభిషేక్‌ మాణిక్‌చంద్‌ పేరును వినియోగించడం అక్రమమని భావిస్తున్న పోలీసులు దీనిపై లోతుగా ఆరా తీయాలని నిర్ణయించారు. సైదాబాద్‌లో ఇల్లు, బంజారాహిల్స్‌ ప్రాంతంలో రెండు కార్యాలయాలు నిర్వహిస్తున్న అభిషేక్‌ వద్ద దాదాపు 15 మంది పని చేస్తున్నారు. దీంతో ఇతను ప్రతి నెలా అద్దెలు, జీతభత్యాలు, ఇతర ఖర్చులకు దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోపక్క నగరం కేంద్రంగా అభిషేక్‌ నిర్వహిస్తున్న సంస్థకు సంబంధించిన సమాచారాన్ని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ) నుంచి సేకరించారు. దీని ప్రకారం అందులో అభిషేక్‌తో పాటు మరో మహిళ సైతం డైరెక్టర్‌గా ఉన్నట్లు గుర్తించారని తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా