రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణం

4 Mar, 2020 10:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బైక్‌ అదుపుతప్పి గుంతలో పడటంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న విదేశీయుడికి తీవ్ర గాయాలైన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్‌ సైనిక్‌పురి నిర్మల్‌ నగర్‌కు చెందిన చిలుక అరవింద్‌(24) పంజగుట్టలోని స్విఫ్ట్‌ సొల్యూషన్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఒకవైపు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తూనే ఖాళీ సమయాల్లో ఉబర్‌ బైక్‌ డ్రైవర్‌గా పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడు.

సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో టోలిచౌకి సమీపంలోని పారామౌంట్‌ కాలనీలో ఉండేనైజీరియా దేశస్తుడైన అబ్దుల్లాహి అనే యువకుడు ఉబర్‌ మోటో బైక్‌ను బుక్‌ చేసుకున్నాడు. పంజగుట్ట నుంచి బైక్‌(టీఎస్‌ 08 ఈఎన్‌ 6329)పై అరవింద్‌ ఆ విదేశీయుడిని కూర్చోబెట్టుకొని బంజారాహిల్స్‌రోడ్‌ నం. 12 లోటస్‌పాండ్‌ మీదుగా పారామౌంట్‌ కాలనీకి వెళ్తుండగా ఫొటోగ్రాఫర్స్‌ కాలనీ వద్ద బైక్‌ అదుపు తప్పి గుంతలో పడింది. దీంతో అరవింద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్నఅబ్దుల్లాహికి తీవ్ర గాయాలుకాగా సమీపంలోని సిటీ న్యూరో సెంటర్‌కు తరలించారు. ఎస్‌ఐ వాసవి కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు