అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రా

5 Apr, 2018 12:36 IST|Sakshi

చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్‌ 

పది గ్రాముల బంగారం, ఫోన్లు, వాచీలు స్వాధీనం

తాడేపల్లిగూడెం రూరల్‌ : చోరీ కేసులో దొంగను అరెస్టు చేసి, పది గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ఫోన్లు, వాచీలు, వెండి పట్టీని స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్‌ మూర్తి తెలిపారు. బుధవారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. తెలంగాణలోని హయత్‌నగర్‌కు చెందిన శీలి శివకృష్ణ అలియాస్‌ శివకుమార్‌ అలియాస్‌ శివ అనే వ్యక్తి తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామంలోని అత్తవారింట్లో నివాసముంటూ తెలంగాణలోను, తాడేపల్లిగూడెం పట్టణంలోనూ పలు చోరీలకు పాల్పడ్డాడు. గత నెల మార్చి 20న పట్టణంలోని బాపూజీ పుంత రోడ్డులోని బీఐ రాజేంద్ర నివాసంలో శివకృష్ణ చోరీ చేశాడు.

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు శివకృష్ణపై నిఘా పెట్టారు. పట్టణ ఎస్సై కేవీ రమణ హయత్‌నగర్‌లో విచారించగా అక్కడ లభించిన సమాచారంతో జగ్గన్నపేటలో ఉంటున్న శివకృష్ణను బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ మూర్తి చెప్పారు. అతని నుంచి 10 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.4 వేలు నగదు, ఐదు వాచీలు, ఐ–ఫోన్, నోకియా లుమియా ఫోన్, వెండి పట్టిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గతంలో కూడా హయత్‌నగర్‌లో ఇటువంటి చోరీలకు పాల్పడి శివకృష్ణ జైలుకు వెళ్లినట్టు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చామన్నారు. ప్రజలు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ విధానాన్ని వినియోగించుకోవడం ద్వారా చోరీల నివారణకు సహకరించాలని సీఐ కోరారు. ఎస్సై కేవీ రమణ, ఏఎస్సై కె.సాంబశివరావు, హెచ్‌సీలు రాంబాబు, అల్లూరి సత్యనారాయణరాజు, సిబ్బంది ఎస్‌.నాగరాజు, కె.రాజు, కె.మహేష్, టి.రవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు