‘కవర్‌’ చేస్తే క్రిమినల్‌ కేసులే!

13 Jun, 2020 11:10 IST|Sakshi

నెంబర్‌ ప్లేట్లను ‘మూసేస్తున్న’ ఉల్లంఘనులు

అదే బాటలో వెళ్తున్న స్నాచర్లు, ఇతర నేరగాళ్లు

చర్యలు ప్రారంభించిన నగర ట్రాఫిక్‌ పోలీసులు

పంజగుట్ట పరిధిలో ఓ యువకుడిపై కేసు  

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో సంచరిస్తున్న ఉల్లంఘనులు నానాటికీ రెచ్చిపోతున్నారు. నిఘా నేత్రాలకు తమ నెంబర్‌ ప్లేట్లు చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్‌’ చేస్తున్నారు. మాస్క్‌లతో సహా కొన్నింటితో మూసేయడం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఉల్లంఘనులపై ట్రాఫిక్‌ పోలీసులు మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ వచ్చారు. అయితే ఈ తరహా ఉల్లంఘనుల్లో మార్పురాకపోవడం, నేరగాళ్ళు సైతం ఇదే బాటపట్టడంతో ట్రాఫిక్‌ కాప్స్‌ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నెంబర్‌ ప్లేట్స్‌ ‘కవరింగ్‌’కు పాల్పడిన వారిని పట్టుకుని శాంతిభద్రతల విభాగానికి అప్పగిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులే ఫిర్యాదు చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తున్నారు. శుక్రవారం ఈ తరహా నేరం చేసి పంజగుట్టలో చిక్కిన చంద్రాయణగుట్ట యువకుడిపై చీటింగ్‌ కేసు నమోదైంది.(నెంబర్‌ప్లేట్‌ కనిపించకుండా ట్యాంపరింగ్‌..)

ఈ–చలాన్‌ తప్పించుకోవడానికే...
సిటీ ప్రధానంగా ఈ నెంబర్‌ ప్లేట్ల కవరింగ్‌ అనేక ఈ–చలాన్లను తప్పించుకోవడానికే చేస్తున్నారని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం నగరంలో పూర్తి స్థాయి నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధానాలు అమలవుతున్నాయి. అంటే... ఒకప్పుడు మాదిరిగా రహదారులపై ఉండే ట్రాఫిక్‌ పోలీసులు ఉల్లంఘనుల్ని పట్టుకున్నప్పుడు వారికి స్పాట్‌లో చలాన్‌ విధించడం, జరిమానా వసూలు చేయడం జరగట్లేదు. కేవలం క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్‌ కెమెరాలతో ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలను నెంబర్‌ ప్లేట్స్‌తో సహా చిత్రీకరిస్తున్నారు. వీటితో పాటు సీసీ కెమెరాల ద్వారా సేకరించిన ఫొటోల ఆధారంగా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సిబ్బంది ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ విధానంలో వాహనాల నెంబర్, దాని ఆధారంగా సేకరించే చిరునామా కీలకం. తమ వాహనాలకు సంబంధించిన నెంబర్‌ ప్లేట్లను వి విధ రకాలుగా కవర్‌ చేయడం, వంచేయడం, విరిచే యడం చేస్తున్న వాహనచోదకులు వాటి రిజిస్ట్రేషన్‌ నెంబర్లు ట్రాఫిక్‌ కెమెరాలకు చిక్కుకుండా తప్పించుకుంటున్నారు. దీన్ని అదునుగా భావించి కొందరు నేరగాళ్ళు సైతం నెంబర్‌ ప్లేట్లు లేకుండా, వాటిని కవర్‌ చేసి తమ పని పూర్తి చేసుకుపోతున్నారు. గత నెల 31న అబిడ్స్‌ పరిధిలో సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన ఓ స్నాచర్‌ ఈ తరహాలోనే నే రం చేశాడు. ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడాని కి పోలీసులు అనేక వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వస్తోంది. 

వెనుక వాటి మూసివేతలే ఎక్కువ...
వాహనాల నెంబర్‌ ప్లేట్స్‌ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్‌ చేయడం అనేది తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోందని అధికారులు చెప్తున్నారు. రోడ్లపై ఈ తరహా నెంబర్‌ ప్లేట్‌ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయత్నిస్తే బైక్స్‌ మాదిరిగా తేలికపాటి వాహనాలు తప్పించుకునిపోలేవు. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఆ తరహా చర్యల జోలికి వెళ్ళట్లేదని ట్రాఫిక్‌ కాప్స్‌ అంటున్నారు. ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నెంబర్‌ ప్లేట్‌కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు. సాధారణంగా ఉల్లంఘనల్ని వాహనం వెనుక నుంచే ఫొటోలు తీస్తుండటంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఇర్రెగ్యులర్‌/ఇంప్రాపర్‌ నెంబర్‌ ప్లేట్‌ ఉల్లంఘనగా పిలిచే వీటిపై ఇప్పటికే ట్రాఫిక్‌ విభాగం అధికారులు అనేకసార్లు స్పెషల్‌డ్రైవ్స్‌ చేశారు. అయినప్పటికీ వాహనచోదకుల్లో పూర్తి స్థాయి మార్పు రాలేదు. దీంతో ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు.

మాస్క్‌ పెట్టి మస్కా కొట్టాలని...
పాతబస్తీలోని చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్‌ జహూరుద్దీన్‌ గురువారం తన ద్విచక్ర వాహనంపై పంజగుట్టకు వచ్చాడు. తన రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ కనిపింకుండా వెనుక నెంబర్‌ ప్లేట్‌కు ఫేస్‌ మాస్క్‌ తగిలించేసిన ఇతగాడు పంజగుట్ట వైపు నుంచి వీవీ స్టాట్యూ వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం గమనించిన ట్రాఫిక్‌ పోలీసులు ఆపి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఇతగాడు ఉద్దేశపూర్వకంగానే నెంబర్‌ ప్లేట్‌ కవర్‌ చేసినట్లు నిర్థారించి స్థానిక లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు అప్పగించారు. ఆ అధికారులు ఇతడిపై మోసం ఆరోపణలపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.  ఎవరైనా నగరవాసులు ఇలాంటి నెంబర్‌ ప్లేట్లతో కూడిన వాహనాలను గుర్తిస్తే ఆ ఫొటోలు తీసి పోలీసు అధికారిక వాట్సాప్‌ నెంబర్‌ 9490616555కు పంపాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు