‘పోలీసులు ఫోన్‌ చేశాకే తెలిసింది’

5 Jan, 2018 14:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘నా భర్తను నేను చంపలేదు. నాకేమి తెలియదు. పాలలో నిద్రమాత్రలు కలిపి నా భర్తకు ఇచ్చాను. కార్తీక్ చెబితేనే నిద్రమాత్రలు కలిపాను. నా భర్తను చంపేస్తారని నాకు తెలియదు. అపస్మారక స్థితిలో ఉన్న నా భర్తను ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పలేదు. నా భర్తను చంపేశారని పోలీసులు ఫోన్‌ చేసి చెప్పిన తర్వాతే తెలిసింద’ని భర్త హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలు జ్యోతి తెలిపింది.

ఈ కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. కర్మన్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన కార్పెంటర్‌ నాగరాజు హత్య కేసులో అతడి భార్య జ్యోతి, ప్రియుడు కార్తీక్‌, దీపక్, యాసీన్‌, నరేష్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జ్యోతి, కార్తీక్‌, అతడి స్నేహితులు కలిసి పథకం ప్రకారం నాగరాజును హత్య చేశారని డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. నేరం చేసినట్టు నిందితులు అంగీకరించారని చెప్పారు.

మీడియా ముందు జ్యోతి, నాగరాజు భిన్నవాదనలు వినిపించారు. భర్తను చంపాలని తాను అనుకోలేదని జ్యోతి చెప్పగా, ఆమె ఒత్తిడి చేయడం వల్లే నాగరాజును చంపామని కార్తీక్ వెల్లడించాడు. ‘డిసెంబర్‌ 30న పదేపదే ఫోన్లు చేసి జ్యోతి రమ్మని పిలిచింది. పొద్దున నుంచి ఒకటే ఫోన్లు చేసింది. నాగరాజుకు నిద్రమాత్రలు వేసేశానని ఫోన్‌ చేయడంతో నా ఫ్రెండ్స్‌ను తీసుకుని వెళ్లాను. తర్వాత మేమంతా కలిసి అతడిని చంపేశాం. తర్వాత శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి దూరంగా పడేశామ’ని కార్తీక్‌ వివరించాడు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు