నిండాముంచిన సైబర్‌ దొంగలు

25 Jun, 2020 11:48 IST|Sakshi

రూ.4 వేల కోసం ‘ప్రయత్నిస్తే’ రూ.74 వేలు గాయబ్‌!

నకిలీ కాల్‌సెంటర్‌ వలలో పడిన నగర యువతి

మరో ముగ్గురి నుంచి రూ.1.5 లక్షలు స్వాహా

కేసులు నమోదు చేసిన సిటీ సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌

సాక్షి, సిటీబ్యూరో: ఓ ఈ–కామర్స్‌ యాప్‌లో రూ.4 వేలు వెచ్చింది ఇయర్‌ ఫోన్స్‌ ఖరీదు చేశారో యువతి... అది ఎంతకీ డెలివరీ కాకపోవడంతో ఆ సంస్థ నెంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేశారు... అందులో కనిపించిన నకిలీ కాల్‌ సెంటర్‌ నెంబర్‌ అసలుదిగా భావించి సంప్రదించారు... సైబర్‌ నేరగాళ్ళు చెప్పినవి చెప్పినట్లుగా చేసి రూ.74 వేలు పోగొట్టుకున్నారు.  ఈమెతో పాటు సైబర్‌ నేరగాళ్ళ చేతిలో మరో రూ.1.5 లక్షలు కోల్పోయిన ముగ్గురు బాధితులు బుధవారం సిటీ సైబర్‌ క్రైౖమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ఓ యువతి ఈ–జీ ఫోన్స్‌ అనే సంస్థకు చెందిన వెబ్‌సైట్‌ ద్వారా ఇయర్‌ ఫోన్లు ఆర్డర్‌ చేశారు. (పోస్టు చేయడమే పాపమైంది...)

వాటి ఖరీదు రూ.4000 ముందే ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించేశారు. ఆ సందర్భంగా వెబ్‌సైట్‌ వాటి డెలివరీ డేట్‌ను సూచించింది. ఆ నిర్ణీత గడువు ముగిసినా కొరియర్‌ ద్వారా సదరు ఇయర్‌ఫోన్స్‌ డెలివరీ కాలేదు. దీంతో ఈ–జీ ఫోన్స్‌ సంస్థను సంప్రదించాలని భావించిన ఆమె దాని ఫోన్‌ నెంబర్‌ కోసం సదరు వెబ్‌సైట్‌లో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ఈ సంస్థ కాల్‌ సెంటర్‌ నెంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. అందులో ఈ–జీ ఫోన్‌ కాల్‌సెంటర్‌ పేరుతో కనిపించిన సెల్‌ ఫోన్‌ నెంబర్‌ నిజమైనదిగా భావించారు. ఆ నెంబర్‌లో సంప్రదించిన యువతి జరిగిన విషయం చెప్పారు. దీంతో అవతలి వ్యక్తులు ఆ ఆర్డర్‌కు సంబంధించిన మొత్తం రిటర్న్‌ చేస్తామని అన్నారు. దానికోసం తాము మీ ఫోన్‌ నెంబర్‌కు పంపే లింకు ఓపెన్‌ చేయాలని సూచించి టీమ్‌ వ్యూవర్‌ యాప్‌ ఇన్‌స్టల్‌ చేయించారు. దీన్ని తమ ఫోన్‌ ద్వారా యాక్సస్‌ చేసిన సైబర్‌ నేరగాళ్ళు బాధితురాలి ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీని ద్వారా ఆమె ఈ వ్యాలెట్‌ వినియోగించిన సైబర్‌ నేరగాళ్ళు రూ.74 వేలు కాజేశారు. 

అంబర్‌పేటకు చెందిన ఓ యువకుడికి కాల్‌ చేసిన సైబర్‌ నేరగాళ్ళు తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్‌ ఫీజుతో రుణం ఇస్తామని ఆన్‌లైన్‌లో ప్రచారం చేసుకున్నారు. ఇది నిజమని నమ్మిన యువకుడు అందులో పేర్కొన్న నెంబర్లలో సంప్రదించారు. సైబర్‌ నేరగాళ్ళు చెప్పిన వాటికి  అంగీకరించడంతో వివిధ ఫీజుల పేరుతో రూ.30 వేలు తమ ఖాతాల్లోకి డిపాజిట్‌ చేయించుకుని మోసం చేశారు.
ఈ–యాడ్స్‌ సైట్‌ ఓఎల్‌ఎక్స్‌లో ఉన్న సెకండ్‌ హ్యాండ్‌ ఫ్రిడ్జ్‌ విక్రయం ప్రకటనకు నగర యువకుడు స్పందించారు. అందులో ఉన్న నెంబర్‌లో సంప్రదించగా ఆర్మీ అధికారిలా సైబర్‌ నేరగాళ్ళు మాట్లాడారు. బేరసారాల తర్వాత ఫ్రిడ్జ్‌కు రేటు ఖరారైంది. అడ్వాన్సులు, ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలు, చెల్లించిన అధిక మొత్తం రిఫండ్‌ పేరుతో రూ.82 వేలు తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్న మోసగాళ్ళు ఆపై ఫోన్‌ చేసినా స్పందించకుండా నిండా ముంచారు.  
వెస్ట్‌ మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి  ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆన్‌లైన్‌లో ఉన్న ప్రకటనపై స్పందించారు. అవతలి సైబర్‌ నేరగాళ్ళు వివిధ ఫీజుల పేరుతో రూ.38,500 కాజేశారు. ఈ ఉదంతాలపై కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రై మ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు