నా నడక, మాట అమ్మాయిలా ఉన్నాయి.. అందుకే..

10 Jul, 2019 10:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై : గే అయిన కారణంగా సమాజం తన పట్ల వివక్ష చూపిస్తోందని ఆవేదన చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అబ్బాయినైన తను అమ్మాయిలా ఉండటానికి ఆ దేవుడే కారణమంటూ సముద్రంలో దూకి ప్రాణాలు విడిచాడు. జూలై 3 న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడించారు. వివరాలు.. ముంబైకి చెందిన అవిన్షు పటేల్‌ చెన్నైలోని ఓ స్పాలో పనిచేస్తున్నాడు. తాను గే అని తెలుసుకున్న అతడు ఛీత్కారాలు తట్టుకోలేక కుటుంబ సభ్యులకు దూరంగా బతుకున్నాడు. అయితే పనిచేసే చోట కూడా అతడికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఈ క్రమంలో చెన్నైలోని ఇంజమ్‌బాక్కం బీచ్‌ వద్ద సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కాగా చనిపోయేముందు అవిన్షు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు చర్చనీయాంశమయ్యాయి. ‘ నేను ఒక అబ్బాయిని. కానీ నా నడక, మాట, ప్రవర్తన అన్నీ అమ్మాయిలాగానే ఉంటాయి. భారతదేశంలో ఉన్న కొంతమంది ప్రజలకు ఇలాంటివి నచ్చవు కదా. అందుకే గే, ట్రాన్స్‌జెండర్లను గౌరవించే దేశాలను చూస్తే గర్వంగా ఉంటుంది. అదే విధంగా ఇండియాలో నాలాంటి వాళ్లను మనుషులుగా చూసేవాళ్లను కూడా. అయినా నేనిలా ఉండటం నా దోషం కాదు. ఇది దేవుడు చేసిన తప్పు. అందుకే నన్ను నేనే ద్వేషిస్తున్నా’ అంటూ అవిన్షు ఫేస్‌బుక్‌లో భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు. ఈ ఘటన నేపథ్యంలో స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ ట్రాన్స్‌జెండర్లకు వేధింపులు మాత్రం తప్పడం లేదంటూ పలువురు వాపోతున్నారు.  

మరిన్ని వార్తలు