నువ్వు ఎక్కడుంటావో తెలుసు.. నిన్ను వదిలిపెట్టను!

26 Apr, 2019 10:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నువ్వు ఎక్కడుంటావో నాకు తెలుసు.. నిన్ను వదిలిపెట్టను అని ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ తన ప్యాసింజర్‌ అయిన అమ్మాయిని బెదిరించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఓలాకు కంప్లైంట్‌ చేయడంతో వెంటనే స్పందించి అతడ్ని ఉద్యోగంలోంచి తీసేసింది. అసలేం జరిగిదంటే.. బెంగళూరులో ఉండే అర్జితా బెనర్జీ తన అక్క ఇంటికి వెళ్లడానికి ఆమె తండ్రి ఓలా క్యాబ్‌ను బుక్‌ చేశారు. ఆ వెంటనే ఆ క్యాబ్‌ డ్రైవర్‌కు ఫోన్‌ చేసిన అర్జితా.. పికప్‌ లొకేషన్‌కు వచ్చిన వెంటనే తనకు కాల్‌ చేయమని సూచించింది. దానికి.. తన నంబర్‌కు ఇష్టమొచ్చినప్పుడు కాల్‌ చేయండి మేడమ్‌ అని డ్రైవర్‌ బదులిచ్చాడు.

ఆ సమాధానం తనకు నచ్చకపోయినా.. ఆలస్యమవుతుందన్న కారణంతో దగ్గర్లో మరో క్యాబ్‌ ఉండకపోయే సరికి ఆ క్యాబ్‌లోనే వెళ్లింది. తనతో పాటు మరి కొంతమంది కూడా ఆ షేరింగ్‌ క్యాబ్‌లో ఎక్కారు. అయితే ఆ క్యాబ్‌ డ్రైవర్‌.. మరీ నిదానంగా వెళ్తుండటంతో అందులో ఉన్నవారు కాస్త వేగంగా వెళ్లమని చెప్పేసరికి ఇష్టమొచ్చినట్లు డ్రైవ్‌ చేశాడు. సరిగా నడిపించమని కోరగా.. మళ్లీ సాధారణంగా డ్రైవ్‌  చేస్తూ అందర్నీ వారి డెస్టినేషన్‌లో దించేశాడు. చివరగా అర్జితా వంతు వచ్చింది. 

అర్జితాను ఎక్స్‌ట్రాగా రూ.200 ఇవ్వమని బెదిరించాడు. అందుకు నిరాకరించిన ఆమె.. తన తండ్రి ముందుగానే మని ఆన్‌లైన్లో కట్టేశాడని బదులిచ్చింది. కావాలంటే తన తండ్రితో మాట్లాడమని ఫోన్‌ ఇచ్చింది.. ఫోన్‌లో మాట్లాడుతూ.. నీ బిడ్డను ఎక్కడైనా వదిలేస్తాను.. చంపిపడేస్తాను అంటూ బెదిరించాడు. చివరకు ఆ డ్రైవర్‌ ఆమె ఫోన్‌ లాక్కున్నాడు. చుట్టుపక్కలా ఎవరూ సాయం రాకపోయేసరికి.. బయపడిన అర్జితా అతడికి రూ500 ఇచ్చి తన ఫోన్‌ను విడిపించుకుంది. వెళ్లేటప్పుడు అర్జితా అతడికి వార్నింగ్‌ ఇచ్చింది. దానికి ప్రతిగా.. తన అడ్రస్‌ తెలుసునని వదిలిపెట్టను అని ఆ క్యాబ్‌ డ్రైవర్‌ బెదిరించాడు. ఈ మేరకు అర్జితా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ క్యాబ్‌ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు