ఐఏఎస్‌ అధికారికి జైలు శిక్ష 

5 Jun, 2019 02:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరీంనగర్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌కు జైలు/జరిమానా

అప్పీల్‌కోసం తీర్పు అమలు వాయిదా వేసిన హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనే ఆరోపణల కేసులో ఐఏఎస్‌ అధికారి (ఇప్పుడు గద్వాల–జోగులాంబ జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు) గతంలో కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా చేసిన కె.శశాంక్‌కు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. జరిమానా సొమ్మును శశాంక్‌ వ్యక్తిగతంగా చెల్లించాలని, ఒకవేళ జరిమానా చెల్లించకపోతే 2 వారాలు అదనంగా సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అప్పీల్‌ నిమిత్తం తీర్పు అమలును 6 వారాలపాటు నిలిపివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. కరీంనగర్‌లోని సిఖ్‌వాడి వీధిలోని తన ఇంటి స్థలం విషయంలో హైకోర్టు ఆదేశాల్ని ధిక్కరించారని పేర్కొంటూ పూనం కౌర్‌ అలియాస్‌ పున్న భాయ్‌ దాఖలు చేసిన కేసులో ఈ తీర్పు వెలువడింది. సిఖ్‌వాడి వీధిలోని రెండు షాపులతో కూడిన ఇంటిని 2014లో కూల్చివేయడంపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్మించే షాపుల సముదాయంలో ఆమెకు షాపు కేటాయించాలని, లేనిపక్షంలో భూసేకరణ చట్ట ప్రకారం ఆమెకు పరిహారం చెల్లించాలని అప్పట్లో హైకోర్టు కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఉన్న శశాంక్‌కు ఆదేశాలు జారీ చేసింది. వీటిని అమలు చేయకపోవడంతో ఆమె కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

>
మరిన్ని వార్తలు