ఐసీఏఐ ప్రెసిడెంట్‌ కూతురి మిస్టరీ డెత్‌

6 Oct, 2017 12:22 IST|Sakshi

సాక్షి, ముంబై : గత రాత్రి రైలు పట్టాలపై దొరికిన యువతి మృత దేహాన్ని ఎట్టకేలకు దక్షిణ ముంబై పోలీసులు గుర్తించారు. ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడు నీలేశ్‌ వికమ్‌సే కూతురు పల్లవిగా తేల్చారు.

20 ఏళ్ల పల్లవి ఫోర్ట్‌ లోని ఓ లా సంస్థలో ఇంటర్న్‌షిఫ్‌ చేస్తోంది. అయితే ఈ నెల 4 నుంచి ఆమె కనిపించకుండా పోయిందంటూ కుటుంబ సభ్యులు ఎంఆర్‌ఏ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పరేల్‌-కర్రీ రోడ్‌ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలపై యువతి మృతదేహం పడి ఉందని ఓ ఆంగతకుడు పరేల్‌ స్టేషన్‌ మాస్టర్‌ కు సమాచారం అందించాడు. దీంతో ఆయన పోలీసులకు విషయం తెలియజేయగా.. యువతి మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. 

అనంతరం చనిపోయింది పల్లవేనని పోలీసులు నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఎప్పటిలాగే తన పనికి వెళ్లిన పల్లవి ఈ నెల 4న సాయంత్రం ఆరుగంటలకు సీఎస్‌ఎంటీ స్టేషన్‌లో రైలు ఎక్కిందని డీసీపీ సమాధాన్‌ పవార్‌ తెలిపారు. ఆ తర్వాతే ఆమె కనిపించకుండా పోయిందని ఆయన తెలిపారు. తొలుత తన చావుకు ఎవరూ కారణం కాదని ఆమె మొబైల్‌ నుంచి కుటుంబ సభ్యులకు సందేశం పెట్టడంతో ఆత్మహత్య చేసుకుందని భావించారు. అయితే, తలతోపాటు శరీరంపై తీవ్ర గాయాలుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్‌ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఆమె ఎలా చనిపోయిందన్న అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని పవార్‌ తెలిపారు. మరోవైపు కాల్‌ చేసి సమాచారం అందించిన అగంతకుడిని ట్రేస్‌ చేసే పనిలో పోలీసులు ఉన్నారు.

మరిన్ని వార్తలు