ఉడుముల విక్రేత అరెస్ట్‌

12 Nov, 2018 09:04 IST|Sakshi
ఉడుములతో పట్టుబడ్డ వేటగాడు ఏసు

ఐదు ఉడుములు స్వాధీనం

తూర్పుగోదావరి ,తాళ్లరేవు (ముమ్మిడివరం): మడ అడవుల్లో సంచరించే ఉడుములను పట్టుకుని కాట్రేనికోన సంత పరిసరాల్లో విక్రయిస్తున్న ఆవుల ఏసు అనే వ్యక్తిని ఆదివారం అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం వన్యప్రాణి విభాగం అధికారి అనంతశంకర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. తమకు అందిన సమాచారం మేరకు శనివారం ఉదయం నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా కాట్రేనికోన సంత ప్రాంతంలో ఉడుములను విక్రయిస్తున్న ఏసును పట్టుకున్నట్టు తెలిపారు. అతడి వద్ద నుంచి ఐదు ఉడుములు స్వాధీనం చేసుకోగా వాటిలో ఒకటి మృతి చెందిందని తెలిపారు. ఈ మేరకు వన్యప్రాణి చట్టం 1972 సెక్షన్‌ 9, 48ఎ ప్రకారం సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్‌ మేజిస్ట్రేటు వద్ద హాజరుపరచనున్నట్టు ఆయన తెలిపారు.

ఉడుమును చంపితే పులిని చంపిన శిక్షే
వన్యప్రాణి చట్టం ప్రకారం పులిని చంపిన వారికి విధించే శిక్షే ఉడుమును చంపిన వారికి కూడా వర్తిస్తుందని అనంతశంకర్‌ తెలిపారు. చట్టంలో ఉడుములు షెడ్యూల్‌–1లో ఉన్నాయన్నారు. పులిని చంపితే మూడు నుంచి ఏడేళ్ల సంవత్సరాల జైలు శిక్ష, రూ.పది వేలు జరిమానా విధించడం జరుగుతుందని, అదేమాదిరిగా ఉడుములతో వ్యాపారం చేసినా, వాటిని చంపినా అదేశిక్ష విధించడం జరుగుతుందన్నారు. 

మరిన్ని వార్తలు