అనుమానాస్పద స్థితిలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని మృతి

2 Aug, 2018 08:44 IST|Sakshi
లిఖిత యామిని మృతదేహం

ఖమ్మం అర్బన్‌: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరంలోని పాండురంగాపురంలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాళ్లు, చేతులు కట్టేసి ఉరికి వేలాడదీశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోది చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. కామేపల్లి మాజీ ఎంపీపీ జర్పుల లక్ష్మణ్‌ నాయక్‌–రమాదేవి దంపతులు పదేళ్ల క్రితం ఖమ్మం నగరంలోని పాండురంగాపురంలో స్థిరపడ్డారు. రమాదేవి గేటు కారేపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వీరి కూతురు లిఖిత యామిని(19) చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ కాలేజీలో ట్రిపుల్‌ ఐటీ చదువుతోంది. మొదటి ఏడాది పూర్తవడంతో సెలవులకు ఇంటికి వచ్చింది. రెండు నెలలపాటు ఇంటి వద్దనే ఉంది.

రెండో ఏడాది తరగతులు ప్రారంభం కానుండడంతో గత ఆదివారం కాలేజీకి వెళ్లాల్సి ఉంది. వచ్చే ఆదివారం వెళదామని ఆమె నిర్ణయించుకుంది. బుధవారం ఆమె తల్లి పాఠశాలకు, తండ్రి బయటకు వెళ్లారు. ఇంటిలో లిఖిత యామిని ఒక్కతే ఉంది. పాఠశాల నుంచి తల్లి రమాదేవి కూతురుకు ఫోన్‌ చేశారు. ఎంతకీ ఫోన్‌ ఎత్తకపోవడంతో ఇంటి కింది పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న వారికి ఫోన్‌ చేసి, ‘లిఖిత పోన్‌ తీయడం లేదు. వెళ్లి చూడండి’ అని కోరారు. వారు పైకెళ్లి చూసే సరికి.. ఇంట్లో ఫ్యాన్‌కు యామిని వేలాడుతూ ఉంది. ఆమె కాళ్లు, చేతులు చీరతో గట్టిగా కట్టేసి ఉన్నాయి. ఆమెది ముమ్మాటికీ హత్యేనని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు. కాళ్లు, చేతులు కట్టేసి ఉంటే ఉరి వేసుకోవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఆమెను ఎవరో చంపి, ఇలా వేలాడదీశారని భావిస్తున్నారు. ఆమె తండ్రి ఫిర్యాదుపై ఎస్‌ఐ అశోక్‌రెడ్డి కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు