హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం

27 Dec, 2018 09:16 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

కమలాపూర్‌(హుజూరాబాద్‌): వివాహేతర సంబంధానికి అడ్డు రావడమే కాకుండా ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్తూ పరువు తీస్తున్నాడన్న కక్షతోనే కమలాపూర్‌కు చెందిన బైరి విజయ్‌కుమార్‌ అనే యువకుడు దుస్తులు వ్యాపారి బైరి రాజనర్సును బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశాడని, నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కాజీపేట ఏసీపీ కె.నర్సింగ్‌రావు తెలిపారు. కమలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. కమలాపూర్‌లో సెల్‌ షాపు నడుకునే విజయ్‌కుమార్‌ గత కొంత కాలంగా కమలాపూర్‌కే చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

రెండు నెలల క్రితం రాజనర్సు వారిద్దరు కలిసి ఉండగా చూసి విషయాన్ని విజయ్‌కుమార్‌ తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో విషయం కాస్తా బయటకు పొక్కింది. దీంతో విజయ్‌కుమార్‌ రాజనర్సు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే రాజనర్సు సదరు మహిళను బ్లాక్‌ మెయిల్‌ చేస్తుండటంతో రాజనర్సును కొట్టాలని, అవసరమైతే హత మార్చాలని విజయ్‌కుమార్‌ నిర్ణయించుకున్నాడు. అప్పటికే రాజనర్సు విజయ్‌కుమార్‌కు కొంత మొత్తం డబ్బులు బాకీ ఉండగా ఆ డబ్బులు ఇవ్వాలని ఈ నెల 18న రాత్రి ఫోన్‌ చేయగా 8 గంటల ప్రాంతంలో రాజనర్సు వచ్చి విజయ్‌కుమార్‌కు రూ.120, ఆ పక్కనే ఉన్న మరో దుకాణాదారుడికి కొన్ని డబ్బులు ఇచ్చి పోతున్న క్రమంలో అతన్ని విజయ్‌కుమార్‌ పిలిచి తనకు మందు తాగించాలని కోరడంతో రాజనర్సు సరేనన్నాడు. చెరువు కట్టపై నుంచి రాజనర్సును ద్విచక్ర వాహనం ఎక్కించుకుని పెద్ద తూము వద్దకు వెళ్లారు.

చెరువు తూములో కూర్చుని మందు సేవిస్తున్న క్రమంలో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ప్రస్తావ వచ్చింది. దీంతో తీవ్ర వాగ్వాదం చేసుకుంటూ చెరువుకట్టపైకి వచ్చారు. కోపంతో ఉన్న విజయ్‌కుమార్‌ అక్కడే ఉన్న ఓ బండరాయితో కొట్టగా రాజనర్సు తల వెనుక భాగంలో తగిలి కింద పడిపోయాడు. ఆ తర్వాత అదే బండరాయితో నుదుటి పైభాగంలో బలంగా మోది చంపాడు. అనంతరం శవాన్ని చెరువు కట్టపై నుంచి ఈడ్చుకెళ్లి  పెద్దతూముపై ఉంచాడు. ఈ హత్యకు సంబంధించి ఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు దొరుకనప్పటికీ  అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరికి ఒక ఫోన్‌ కాల్‌ డాటా ఆధారంగా నిందితుడిని గుర్తించామని వివరించారు. అతడి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, మొబైల్‌ తదితర వస్తువులు స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ హత్యా ఘటనలో నిందితుడిని చాకచక్యంగా గుర్తించి, పట్టుకున్న స్థానిక ఇన్‌స్పెక్టర్‌ బాలాజీ వరప్రసాద్, సహకరించిన ఎస్సైలు సూర్యప్రకాష్, టీవీఆర్‌ సూరి, పోలీసు సిబ్బందిని సీపీ రవీందర్, ఏసీపీ అభినందించారు.

మరిన్ని వార్తలు