వివాహేతర సంబంధం.. ప్రియురాలు దారణ హత్య

26 Nov, 2018 11:18 IST|Sakshi
మృతురాలు గిరిజ (ఫైల్‌) నిందితుడు గిరి

వీఆర్‌వో ఎదుట లొంగిపోయిన నిందితుడు

చంద్రగిరి: తనతో కాకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ప్రియుడు ప్రియురాలిని హత్య చేశాడు. ఈ విషయం ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వీఆర్వో ఎందుట లొంగిపోయాడు. స్థానికుల కథనం మేరకు..మండలంలోని మల్లయ్యపల్లికి చెందిన చెంచు మునికి మండపంపల్లికి చెందిన గిరిజ(33)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గిరిజ అదే గ్రామానికి చెందిన మునస్వామి కుమారుడు గిరి(38)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

గిరిజ అదే గ్రామానికి చెందిన మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని గిరి అనుమానించాడు. ఈ విషయంపై గిరిజతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీన గిరిజ, గిరి వ్యవసాయ బావి వద్ద కలుసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన గిరి పక్కనే ఉన్న కర్రతో ఆమె తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో గిరిజ అక్కడికక్కడే మృతిచెందింది. గిరి తన ఇంటి నుంచి సంచులు తీసుకెళ్లి మృతదేహాన్ని మూటకట్టి బావిలో పడేసి వెళ్లిపోయాడు.

భర్త ఫిర్యాదుతో సంఘటన వెలుగులోకి..
10 రోజులుగా తన భార్య కనిపించడంలేదని గిరిజ భర్త చెంచు ముని శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన గిరిపై తనకు అనుమానం ఉందని పేర్కొన్నాడు. తన భార్య సెల్‌ఫోన్‌ కూడా అతని వద్దే ఉన్నట్టు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున నిందితుడు గిరి చంద్రగిరి వీఆర్‌వో మునస్వామి ఎదుట లొంగిపోయాడు. గిరిజను తానే హత్య చేసి బావిలో పడేసినట్లు అంగీకరించాడు. అతన్ని వీఆర్‌వో పోలీసులకు అప్పగించారు. నిందితుడు చెప్పిన వివరాల మేరకు పోలీసులు మల్లయ్యపల్లి బావి వద్దకు వెళ్లి గిరిజ మృతదేహాన్ని వెలికి తీశారు. శరీరం కుళ్లిపోయి ఎముకలు మాత్రమే ఉండడంతో పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్‌ కళాశాలకు తరలించారు. సీఐ ఈశ్వరయ్య ఆదేశాల మేరకు ఎస్‌ఐ చిరంజీవి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు