వివాహేతర సంబంధం మహిళ.. దారుణ హత్య

14 Nov, 2018 09:04 IST|Sakshi
మంజుల (ఫైల్‌) నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శిరీష

సాక్షి, అనంతగిరి: అప్పు తీర్చలేదని ఓ మహిళను దుండగుడు అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. వ్యవసాయ పొలంలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శిరీష కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వికారాబాద్‌ మండలం మదన్‌పల్లి గ్రామానికి చెందిన బోయిని మంజుల(35) ఈ నెల 9న హత్యకు గురైంది. మృతురాలి భర్త చంద్రయ్య మూడేళ్ల క్రితం మృతిచెందాడు. కాగా మంజులకు అదే గ్రామానికి చెందిన మంగళి రాజశేఖర్‌తో వివాహేతర సంబంధం కొనసాగుతోంది.

గత కొన్ని నెలల క్రితం మంజుల రాజశేఖర్‌ వద్ద రూ. 80 వేలు అప్పుగా తీసుకుంది. తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేదు. అప్పుగా ఇచ్చిన డబ్బు అడిగితే ఇవ్వడం లేదని రాజశేఖర్‌ మంజులపై కసి పెంచుకున్నాడు. ఎలాగైన ఆమెను కడతేర్చాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో ఈ నెల 9న రాజశేఖర్‌ గ్రామంలోని కల్లు దుకాణంలో కల్లు తీసుకుని గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలోకి వెళ్లాడు. మంజుల కూడా అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య డబ్బుల విషయమై ఘర్షణ జరిగింది. దీంతో రాజశేఖర్‌ కత్తితో మంజుల మెడ, చేతిపై దాడి చేసి హత్యచేశాడు.

అనుమానం బలపడింది
అదే గ్రామానికి చెందిన కిష్టయ్య పొలంలో మంజుల విగతజీవిలా పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. హత్య జరిగిన ప్రదేశంలో బీరు బాటిళ్లు, కల్లు ప్యాకెట్లు పడి ఉండటాన్ని గమనించారు. అక్కడ లభించిన ఆధారాల ప్రకారం మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో అదే గ్రామానికి చెందిన రాజశేఖర్‌తో అక్రమ  సంబంధం ఉందని బయటపడింది.

దీంతో నిందితుడి పరారీలో ఉండడం, ఫోన్‌ స్విచ్ఛాప్‌ రావడంతో అనుమానం బలపడింది. గాలింపు ముమ్మరం చేసిన పోలీసులకు సోమవారం యంఆర్పీ చౌరస్తాలో రాజశేఖర్‌ పట్టుపడ్డాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని, రాజశేఖర్‌పై రౌడీషీట్‌ కూడా తెరుస్తున్నట్లు డీఎస్పీ శిరీష చెప్పారు. కేసును ఛేదించిన సీఐ సీతయ్య, ఎస్‌ఐ లక్ష్మయ్యను డీఎస్పీ అభినందించారు.

>
మరిన్ని వార్తలు