యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా 

29 Aug, 2018 12:43 IST|Sakshi
  అధికారులు ఆదేశించినా గుట్టపై జేసీబీతో  కొనసాగుతున్న తవ్వకాలు   

ధన్వాడ (నారాయణపేట) : గ్రామాల్లో పైరవీకారులు, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యమైంది. అధికారుల అనుమతి లేకుండా సహజవనరులను ధ్వంసం చేస్తున్నారు. మండలంలోని మంత్రోనిపల్లి గ్రామ శివారులో ఉన్న గుట్టను తవ్వి అక్కడి మట్టిని తరలిస్తున్నా అడ్డుకునే నాథుడే లేకుండా పోయారు. ముందు గుట్టపై ఉన్న చెట్లను పూర్తిగా తొలగించారు. అంతటితో ఆగకుండా గుట్ట అంచునుంచి కొద్దికొద్దిగా మట్టిని తొలచి రవాణా చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు గ్రామస్తులు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. గున్ముక్ల నుంచి మంత్రోనిపల్లి గ్రామం వరకు మొటల్‌రోడ్డు మంజూరైంది.

అది పూర్తి కాకముందే బీటీకి అనుమతులు రావడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పక్కనే ఉన్న గుట్ట నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారు. ఆ ప్రాంతమంతా సమాంతరం కావడంతో కొందరు చదునుచేసి పంటలు కూడా పండిచుకుంటున్నారు. ఇదిలాఉండగా మంగళవారం బీటీ రోడ్డు పనులు ప్రారంభించడానికి వచ్చిన ఆర్‌అండ్‌బీ అ«ధికారులు ఈ వ్యవహారాన్ని చూసికూడా చూడనట్లు నటించారు. కొందరు గ్రామస్తులు ఈ విషయంపై స్థానిక తహసీల్దార్‌ రాఘవేంద్రనా«థ్‌కు ఫిర్యాదు చేయగా ఆయన స్పందించి ఆర్‌ఐ శ్రీనివాసులును పంపించి పనులను నిలిపివేయించారు. ఆయన వెళ్లిపోగానే మళ్లీ పనులు మొదలెట్టారు.

 

మరిన్ని వార్తలు