తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత..!

23 May, 2018 10:28 IST|Sakshi
కొత్వాన్‌పల్లి చెరువులో జేసీబీతో మట్టిని తోడుతున్న దృశ్యం

జిల్లా దాటుతున్న నల్ల మట్టి

కాసులు కురిపిస్తున్న మన్ను

అక్రమార్కుల ఇష్టారాజ్యం

పట్టించుకునే నాథుడు కరువు

రేగోడ్‌(మెదక్‌): నల్ల మట్టి కాసుల వర్షం కురిపిస్తోంది.. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అక్రమార్కులు చెరువును కొల్లగొడుతూ నల్లమట్టిని జిల్లా దాటిస్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. ఈ తతంగం సోమవారం వెలుగుచూసింది. మండలంలోని కొత్వాన్‌పల్లి చెరువు మరమ్మతు కోసం రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకంలో సుమారు రూ. 46 లక్షలు మంజూరు చేసింది.

పూడిక తీతలో భాగంగా చెరువులో మట్టిని తీస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏ గ్రామంలోని చెరువు మట్టిని ఆ ఊరి రైతులే తీసుకెళ్లాలి. ఇతర వ్యక్తులు ఎవరూ మట్టిని తీసుకోకూడదు. కానీ ఇక్కడ ఏకంగా మెదక్‌ జిల్లా కొత్వాన్‌పల్లి చెరువు నుంచి సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామ శివారులోకి టిప్పర్లలో నల్లమట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నా అడిగేనాథడు లేకుండా పోయారు.

నల్లమట్టికి డిమాండ్‌ ఉండటంతో ఇదే అదనుగా భావించిన కొందరికి వరంగా మారింది. టిప్పర్లను లీజ్‌కు తీసుకుని వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్ల మట్టి మాయలో పడిన కొందరు చెరువును తోడేస్తున్నారు. నల్లమట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

చెరువును తవ్వేస్తున్నా.. అధికారులది ప్రేక్షక పాత్రా..? లేక వారికి తెలియకుండానే దందా జరుగుతోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నల్లమట్టిని ఏకంగా జిల్లానే దాట వేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ తతంగంపై విచారణ జరిపించాలని పలువురు పేర్కొంటున్నారు. 
 

మరిన్ని వార్తలు