చెక్కుతో అక్రమంగా సొమ్ము డ్రా

10 Oct, 2017 08:56 IST|Sakshi

బ్యాంకు సిబ్బంది నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు

చెక్కుతో అక్రమంగా సొమ్ము డ్రా

విజయనగరం , ఆనందపురం(భీమిలి) : బ్యాంకు నుంచి వ్యక్తి గత రుణం పొందిన అనంతరం హామీగా ఇచ్చిన చెక్కుల ద్వారా బ్యాంకు కార్యకలాపాల ప్రతినిధులు వేలాది రూపాయలు డ్రా చేసిన వైనంపై సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితుడు పి.వి.వి.ప్రసాదరావు అందించిన వివరాల ప్రకారం... విజయనగరంలోని ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ నుంచి ప్రసాదరావు రూ.2 లక్షలు వ్యక్తిగత రుణం పొంది ఈ ఏడాది ఫిబ్రవరి 10న బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రతినిధికి హామీగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన ఐదు చెక్కులు అందజేశాడు. అప్పటి నుంచి ప్రసాదరావు క్రమం తప్పకుండా వాయిదాలను బ్యాంక్‌కు చెల్లిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రసాదరావు సెప్టెంబర్‌ 7న కొత్తగా కారు కొనుగోలు చేసి విజయనగరం వరుణ్‌ మోటార్స్‌ వారికి రూ.21 వేల చెక్కును అందజేశారు. అయితే ఖాతాలో డబ్బులు లేవని వరుణ్‌ మోటార్స్‌ వారు ప్రసాదరావుకు తెలపడంతో ఖాతా లావాదేవీలను పరిశీలించారు.

దీంతో తాను ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌కు హామీగా ఇచ్చిన చెక్కు నంబరు 000030 ద్వారా పి.కుసుమ హరనాథ్‌ అనే వ్యక్తి ఈ ఏడాది ఆగస్ట్‌ 29న రూ.90 వేలు డ్రా చేసినట్టు గుర్తించారు. ఈ మేరకు సోమవారం స్థానిక సీఐ ఆర్‌.గోవిందరావుకి ఫిర్యాదు చేశారు. దీంతో కుసుమ హరనాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ సిబ్బందే తనకు చెక్కు అందించినట్టు హరనాథ్‌ విచారణలో వెల్లడించారు. సీఐ గోవిందరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు