అన్నను అడ్డుకున్నా...తమ్ముడు వదలలేదు

15 Dec, 2019 01:15 IST|Sakshi
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న చాంద్రాయణగుట్ట పోలీసులు

చాంద్రాయణగుట్టలో ఇద్దరు బాలికలను కిడ్నాప్‌ చేసిన అన్న  

అనుమానం వచ్చి తమ్ముడితో వాళ్లను పంపిన తల్లి.. 

లాడ్జిలో ఓ బాలికపై లైంగిక దాడి 

అన్నదమ్ములకు రిమాండ్‌

సాక్షి, చాంద్రాయణగుట్ట: పరిచయం లేని ఇద్దరి ఆడపిల్లల్ని ఇంటికి ఆటోలో తెచ్చిన కొడుకును సందేహించిన అతని తల్లి వారిని సురక్షితంగా వారింటికి పంపాలని రెండో కుమారుడికి అప్పగిస్తే అతనూ బరితెగించి ఓ బాలికపై లైంగికి దాడికి పాల్పడిన సంఘటన నగరంలోని చాంద్రాయణగుట్ట పరిధిలో చోటుచేసుకుంది. ఈ కేసులో తొలుత ఇరువురి బాలికల కిడ్నాప్‌నకు పాల్పడిన అన్నను, వారిలో ఒకరిపై లైంగిక దాడికి పాల్పడిన తమ్ముడ్ని పోలీసులు అరెస్టు చేసి శనివారం రిమాండుకు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ రుద్ర భాస్కర్‌ కథనం ప్రకారం.....ఇంద్రానగర్‌కు చెందిన ఓ వ్యక్తి కుమార్తె (10) ఈ నెల 8వ తేదీ ఉదయం హాషామాబాద్‌లో ఉండే బంధువుల ఇంటికి వెళ్లింది. అదేరోజు మధ్యాహ్నం ఆ బాలిక తనకు సోదరి వరుస అయ్యే మరో బాలిక (18)తో కలసి రోడ్డుపై వెళుతున్న సమయంలో అటుగా వచ్చిన వట్టెపల్లికి చెందిన ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ ఆమెర్‌ (24) అడ్డగించాడు. వారిని ఆపి బెదిరించి తన ఆటో (టీఎస్‌11యూఏ 8408)లో ఎక్కించుకొని గల్లీల్లో తిప్పుకుంటూ చార్మినార్, నాంపల్లి దర్గా వద్దకు తీసుకెళ్లి వారిపై అఘాయిత్యానికి పాల్పడాలన్న పథకంతో సాయంత్రం వట్టెపల్లిలోని తన ఇంటికి తీసుకొచ్చాడు.

అప్పటికి ఇంట్లోనే ఉన్న అతని తల్లి వారిని చూసి ప్రశ్నించింది. వెంటనే వారికి భోజనం చేయించిన ఆమె పెద్ద కుమారుడి తీరుపై అనుమానించి....చిన్న కుమారుడు మహ్మద్‌ మూసా (21)కు బాలికలకు తోడుగా వెళ్లి వారి ఇంటి వద్ద దించి రావాలని సూచించింది. దీంతో అతడు వారిని బైక్‌పై ఎక్కించుకొని తీవ్రంగా బెదిరించి నేరుగా నాంపల్లిలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు.వారిలో చిన్న పాప నిద్ర పోవడంతో....18 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం బాలికలను ఫలక్‌నుమా రైల్వేస్టేషన్‌ వద్ద విడిచి వెళ్లిపోయాడు. అనంతరం బాధితులు వారి కుటుంబీకులకు ఫోన్‌ చేయడంతో వారొచ్చి ఇంటికి తీసుకెళ్లారు. తొలుత విషయం చెప్పడానికి భయపడిన వారు....చివరకు జరిగిన విషయాన్ని వెల్లడించారు. బాలికల అదృశ్యంపై 8వ తేదీ రాత్రే వారి తండ్రి చాంద్రాయణగుట్టలో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మరుసటిరోజు ఇంటికి వచ్చిన బాలికలను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘోరాన్ని తెలియజేశాడు. అత్యాచారానికి గురైన బాలికను భరోసా సెంటర్‌కు తరలించిన పోలీసులు పూర్తి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరకు ఇద్దరు అన్నదమ్ములను అరెస్ట్‌ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు