పారిపోయి వచ్చిన మృగాడికి ఏడేళ్ల జైలు శిక్ష

5 Jun, 2019 08:54 IST|Sakshi

లండన్‌ : మహిళపై అత్యాచారానికి పాల్పడి ఇండియాకు పారిపోయి వచ్చిన ఎన్నారై స్పెయిన్‌లో పట్టుబడ్డాడు. విచారణలో భాగంగా నేరం రుజువైన క్రమంలో అతడికి స్థానిక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలు... భారత్‌కు చెందిన అజయ్‌ రాణా(35) తూర్పు ఇంగ్లండ్‌లోని సఫ్లోక్‌లో నివసించేవాడు. ఈ క్రమంలో 2017, డిసెంబరులో తన హౌజ్‌మేట్‌ కారు తీసుకుని బయటికి వెళ్లాడు. దారిలో ఒంటరిగా నడిచి వెళ్తున్న ఓ మహిళకు లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత ఆమెను డిక్కీలో బంధించి అకృత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అరెస్టు భయం వెంటాడటంతో.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదనే సాకు చెప్పి ఇండియాకు వచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు స్పెయిన్‌కు తన మకాం మార్చాడు.

హెడ్‌ఫోన్స్‌ పట్టించాయి..
లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి తనను మోసం చేసిన అజయ్‌కు శిక్ష వేయించాలని నిర్ణయించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీ, నిందితుడి కారు వివరాలు ఆధారంగా పోలీసులు అతడి ఆచూకీ కనిపెట్టారు. సఫ్లోక్‌లోని అజయ్‌ ఫ్లాట్‌లో దొరికిన హెడ్‌ఫోన్స్‌ స్వాబ్స్‌లో లభించిన డీఎన్‌ఏతో.. బాధితురాలి శరీరం నుంచి సేకరించిన డీఎన్‌ఏ శాంపిల్స్‌ మ్యాచ్‌ అవడంతో.. అతడిని నిందితుడిగా నిర్ధారించారు. అజయ్‌పై యూరోపియన్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసి.. గత నవంబరులో స్పెయిన్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కోర్టు అతడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష ఖరారు చేసింది.

నన్ను నేనే కొట్టుకునేదాన్ని..
ఈ విషయం గురించి బాధితురాలు మాట్లాడుతూ..‘ ఆరోజు ఓ భారత వ్యక్తి నాకు లిఫ్ట్‌ ఇస్తానని చెప్పాడు. అప్పటికే అతడు మరో ఇద్దరిని కూడా అదే విధంగా కారులో ఎక్కించుకోవడంతో అనుమానం రాలేదు. అయితే కాసేపటి తర్వాత వాళ్లు దిగిపోయారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లి డిక్కీలో పడేసి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన నేను నా స్నేహితుల ఇంటికి వెళ్లి విషయం వివరించాను. పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ చాలా రోజుల వరకు అతడి జాడ తెలియలేదు. అతడి మీద కోపంతో నన్ను నేనే కొట్టుకునేదాన్ని. ఆరోజు జరిగిన ఘటన గుర్తొచ్చినప్పుడల్లా రోలర్‌ కోస్టర్‌లా బుర్ర గిర్రున తిరిగేది. ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితుల్లో తలను గోడకు బాదుకునే దాన్ని. భావోద్వేగాలను అదుపు చేసుకోలేక పిచ్చిగా ఏడ్చేదాన్ని. కౌన్సిలింగ్‌ తీసుకున్నా నా పరిస్థితి మెరుగుపడలేదు’ అని తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి చెప్పుకొచ్చింది. కోర్టు తీర్పు వెలువడిన క్రమంలో.. ఆలస్యంగానైనా తనకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు