కూలిన ప్రైవేట్‌ విమానం; ముగ్గురు మృతి

10 Aug, 2019 08:24 IST|Sakshi

వాషింగ్టన్‌ : ప్రైవేట్‌ విమానం కూలిపోయిన ఘటనలో భారత్‌కు చెందిన వైద్య దంపతులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో వీరి వెంటే ఉన్న 19 ఏళ్ల కూతురు కూడా మృత్యువాత పడింది. గురువారం ఉదయం ఫిలడెల్ఫియాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... భారత్‌కు చెందిన జస్వీర్‌ ఖురానా(60), ఆయన భార్య దివ్యా ఖురానా(54) ఎయిమ్స్‌లో వైద్య విద్యనభ్యసించారు. ఈ క్రమంలో ఇరవై ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జస్వీర్‌ ఓ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పని చేస్తుండగా.. దివ్యా పిల్లల ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. కాగా సంపన్నులైన ఖురానా దంపతులు ఓ చిన్నపాటి ఎయిర్‌క్రాఫ్ట్‌ను కొనుగోలు చేశారు.

ఈ క్రమంలో గురువారం కుమార్తె కిరణ్‌ ఖురానాతో కలిసి ఫిలడెల్ఫియా నుంచి ఓహియోకు విమానంలో బయల్దేరారు. 44 ఏళ్ల క్రితం నాటి ఆ విమానాన్ని నడుపుతున్న జస్వీర్‌ దానిని అదుపు చేయలేకపోయారు. దీంతో బయల్దేరిన కొద్ది సేపటికే జనావాసాల సమీపంలో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఖురానా దంపతులతో పాటు వారి కుమార్తె కూడా దుర్మరణం చెందింది.

కాగా ఖురానా కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం పట్ల వారు పనిచేస్తున్న ఆస్పత్రి యాజమాన్యం, ఇరుగుపొరుగు వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందరితో కలివిడిగా ఉంటూ రోగులను కూడా ఎంతో ప్రేమగా పలకరించే దివ్యా మృతి తమను కలచివేసిందన్నారు. ఇక పెద్ద కూతురు వారితో వెళ్లకపోవడం వల్లే ప్రాణాలతో ఉందని, ఆ దేవుడు తనకు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. కాగా ఇంధనం అయిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు