దెయ్యంలాంటి సవతి తల్లి.. 22 ఏళ్ల శిక్ష

4 Jun, 2019 11:35 IST|Sakshi

న్యూయార్క్‌ : సవతి కూతురిని దారుణంగా హతమార్చిన భారత సంతతికి చెందిన ఓ మహిళను స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. 2016లో చిన్నారిని చంపిన కేసులో ఆమెకు 22 ఏళ్ల శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. అత్యంత హేయమైన చర్యకు పాల్పడిన నిందితురాలికి ఈ శిక్షే సరైందని అభిప్రాయపడింది. ‘ కొంతమంది సవతి తల్లులు ఎంత దారుణంగా వ్యవహరిస్తారో ఈ కేసు చూస్తే అర్థమవుతోంది. అసలు నిందితురాలు ఇలాంటి చర్యకు పాల్పడుతుందని ఊహించలేం. చిన్నారి చేతులు కట్టేసి, గొంతు నులిమి దారుణంగా హతమార్చింది. దెయ్యాల్లాంటి సవతి తల్లుల కథలన్నింటిలో ఇది ఒకటి. తొమ్మిదేళ్ల చిన్నారిని హత్య చేసిన ఆమెకు ఈ శిక్ష సరిపోదు. జీవితాంతం జైళ్లో మగ్గాల్సిందే’ అని తీర్పు వెలువరించే క్రమంలో జాన్‌ రియాన్‌ అనే అటార్నీ వ్యాఖ్యానించారు.

కాగా షామ్‌దాయీ అర్జున్‌(55) అనే మహిళ భర్త, అతడి తొమ్మిదేళ్ల కూతురితో కలిసి న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో నివసిస్తోంది. అయితే సవతి కూతురిపై అక్కసు పెంచుకున్న అర్జున్‌ ఆమెను అడ్డుతొలగించుకోవాలని భావించింది. ఈ క్రమంలో 2016 ఆగస్టులో బాధితురాలిని గొంతు నులిమి చంపేసింది. విచారణలో భాగంగా ఈ కేసులో సాక్షి అయిన ఓ మహిళ మాట్లాడుతూ..‘నా మనవలతో కలిసి క్వీన్స్‌లో ఉండే పాత అపార్టుమెంటుకు వెళ్లాను. ఆ సమయంలో అర్జున్‌ను కూతురి గురించి ప్రశ్నించాను. అప్పుడు ఆమె పొంతన లేకుండా మాట్లాడింది. చిన్నారిని కలవాలనుకుంటున్నాననగా.. బాత్‌రూంలో స్నానం చేస్తోందని చెప్పింది. అయితే గంటల సమయం గడిచినా బయటికి రాకపోవడంతో తనకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె భర్తను పిలిచి బాత్‌రూం తలుపులు పగులగొట్టగా.. బాలిక బాత్‌టాబ్‌లో శరీరంపై ఎటువంటి అచ్చాదన లేకుండా నిర్జీవంగా పడి ఉంది’ అని తెలిపింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో స్నానం చేయిస్తానని చిన్నారిని తీసుకువెళ్లిన షామ్‌దాయి ఆమెను పాశవికంగా హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో.. 22 ఏళ్ల శిక్ష విధిస్తూ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది.

మరిన్ని వార్తలు