బాధితుల ట్వీట్‌పై స్పందించిన విదేశాంగ మంత్రి

24 Jan, 2020 20:57 IST|Sakshi

కెనడాలో తమిళనాడు యువతిపై దాడి

సాయమందించాలని బాధితుల విఙ్ఞప్తి

స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్‌

విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన బుధవారం కెనడాలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన రాచెల్‌(23) అనే యువతి కెనాడాలోని టొరంటోలో మాస్టర్స్‌ చదువుతోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఒంటరిగా వస్తున్న యువతిని దుండగులు కత్తితో దాడి చేసి కొంత దూరం లాక్కెళ్లి పడేశారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న రాచెల్‌ కుటుంబ సభ్యులు.. కెనడా వెళ్లడానికి ప్రయత్నించగా వీసా విషయంలో ఆలస్యం ఏర్పడింది.

దీంతో రాచెల్‌ మామయ్య.. కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌కు ట్వీట్‌ చేశారు. కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తన మేనకోడలిపై హత్యాయత్నం జరిగిందని, ఆమెకు సహాయం చేయాలని కోరారు. దీనికి సంబంధించి స్థానిక ఛానల్‌లో ప్రసారం చేశారని.. రాచెల్‌ తల్లిదండ్రులు తమిళనాడులో ఉన్నారని వాళ్లు అక్కడకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన మంత్రి జయశంకర్‌ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు.. ‘కెనడాలోని టొరంటోలో రాచెల్ ఆల్బర్ట్ అనే భారతీయ విద్యార్థిపై  దాడి జరిగిన విషయం తెలిసి షాక్‌కు గరుయ్యాను. ఆమె కుటుంబం కెనాడా వెళ్లడానికి  వీసాకు సహాయం చేయమని నేను విదేశాంగశాఖ అధికారులను ఆదేశించాను. బాధితురాలు కుటుంబ సభ్యులు వెంటనే సాయం కోసం 9873983884ను సంప్రదించవచ్చు’ అని జైశంకర్  ట్వీటర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు