థాయ్‌లాండ్‌లో భారత టెకీ దుర్మరణం

11 Oct, 2019 14:31 IST|Sakshi

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ థాయ్‌లాండ్‌లో దుర్మరణం పాలయ్యారు. ఫుకెట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌కు చెందిన ప్రఙ్ఞా పలివాల్‌(29) బెంగళూరులో టెకీగా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా ఫుకెట్‌లో జరుగుతున్న కంపెనీ వార్షిక సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ప్రఙ్ఞా సహోద్యోగి ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే తమకు ఎవరికీ పాస్‌పోర్టు లేదని... ప్రఙ్ఞా శవాన్ని భారత్‌కు తీసుకురావాల్సిందిగా ఆమె కుటుంబ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించారు.

ఈ విషయంపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే అలోక్‌ చతుర్వేది ప్రఙ్ఞా మృతదేహం ప్రస్తుతం ఫుకెట్‌లోని పటాంగ్‌ ఆసుపత్రిలో ఉందని.. ఆమె కుటుంబ సభ్యులకు సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్‌ జయశంకర్‌ ఈ విషయంపై స్పందించారు. ‘ థాయ్‌లాండ్‌లో ఉన్న భారత ఎంబసీ బాధిత కుటుంబానికి తప్పక సహాయపడుతుంది. కఠిన సమయాల్లో వారికి తోడుగా ఉంటుంది అని ట్వీట్‌ చేశారు. ఇక మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కూడా ప్రఙ్ఞా కుటుంబానికి అన్ని విధాలుగా తోడు ఉంటామని ప్రకటించారు.   

మరిన్ని వార్తలు