అదృశ్యమై, రాకాసి కొండచిలువ కడుపులో..

16 Jun, 2018 15:20 IST|Sakshi

జకర్తా : తోటలోకి వెళ్లి అదృశ్యమైన మహిళ కేసు విషాదంగా ముగిసింది. రాకాసి కొండచిలువ ఆమెను మింగేసినట్లు ఒకరోజు తర్వాత గుర్తించారు. ఈ ఘటన ఇండోనేసియాలోని మునా ఐలాండ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెర్సియపన్‌ లావెలా గ్రామంలో వా టిబా అనే 54 ఏళ్ల మహిళ కూరగాయలు కోసేందుకు తన తోటలోకి వెళ్లింది. అయితే రాత్రి అయినా ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికినా లాభం లేకపోయింది.

వా టిబా కనిపించడం లేదని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం రోజు వారి తోటలోకి వెళ్లి చూడగా.. 7 మీటర్ల (దాదాపు 23 అడుగుల) పొడవైన రాకాసి కొండచిలువను గుర్తించారు. అయితే అది వేగంగా కదలడం లేదని, అది టిబాను మింగేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. కొందరు ఆ రాకాసి కొండచిలువను చంపి, దాన్ని కోసి చూడగా అందులో వా టిబా మృతదేహం ఉండటంతో కుటుంబసభ్యులు, స్థానికులు షాకయ్యారు.

పోలీస్‌ అధికారి హమ్కా మాట్లాడుతూ.. టిబా చెప్పులను గుర్తించి చుట్టుపక్కల వెతకగా స్థానికులకు కొండచిలువ కనిపించింది. ఆపై దాన్ని చంపి కోసి చూడగా టిబా మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా చిన్న చిన్న జంతువులను కొండచిలువలు తింటాయని, ఇక్కడ మహిళను(మనిషిని) బలితీసుకోవడం దురదృష్టకరం అన్నారు. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లలో ఆరు, ఏడు మీటర్ల పొడవైన కొండచిలువలు ఉంటాయని హమ్కా వివరించారు.



 
 

మరిన్ని వార్తలు