'పూడ్చి పెట్టకముందు.. పెట్టిన తర్వాత ఫోన్‌ చేసింది'

10 Jan, 2018 13:50 IST|Sakshi

సాక్షి, ముంబయి : దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో పీటర్‌ ముఖర్జియా పాత్ర ఉన్నట్లు మరోసారి తేటతెల్లమైంది. స్వయంగా పీటర్‌ ముఖర్జియానే షీనా హత్యకు ప్లాన్‌ చేయించారా అనే కోణంలో కూడా కేసు మలుపు తిరగనుంది. ఎందుకంటే ఆ రోజు హత్య చేసిన తర్వాత షీనాను పూడ్చి పెట్టిన ప్రాంతం నుంచి పీటర్‌కు ఇంద్రాణి ఫోన్‌ చేసినట్లు ఆమె డ్రైవర్‌ ఈ కేసులో అప్రూవర్‌ అయిన శ్యామ్‌వర్‌ రాయ్‌ చెప్పాడు. దీంతో పీటర్‌కు తెలిసే ఈ హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. 2012 ఏప్రిల్‌ 23న షీనా బోరా హత్య జరిగిన విషయం తెలిసిందే.

ఇంద్రాణి తన మాజీ భర్త, డ్రైవర్‌ శ్యామ్‌వర్‌రాయ్‌తో కలిసి కన్న కూతురునే కడతేర్చింది. ఈ హత్య ఘటన దేశంలో సంచలనమైంది. ఈ కేసులో ప్రధాన సాక్షి శ్యామ్‌వర్‌ రాయ్‌ అప్రూవర్‌గా మారి ప్రస్తుతం సీబీఐకు సహకరిస్తున్నాడు. అయితే, పీటర్‌ తరపు న్యాయవాది ప్రస్తుతం శ్యామ్‌వర్‌ రాయ్‌ వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దీంతో ఆయనకు శ్యామ్‌ ఈ విషయాలు వెల్లడించాడు. ఆ రోజు ఇంద్రాణి రెండుసార్లు పీటర్‌కు ఫోన్‌ చేశారని, హత్య చేసిన తర్వాత పూడ్చిపెట్టేందుకు వెళ్లే సమయంలో ఓసారి, పూడ్చిపెట్టిన తర్వాత మరోసారి రెండుసార్లు ఫోన్‌ చేసినట్లు తెలిపాడు. తనకు కూడా పనిబాగా పూర్తి చేశావంటూ కితాబిచ్చారని వెల్లడించాడు.

మరిన్ని వార్తలు