ఇంద్రాణి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

20 Feb, 2018 15:16 IST|Sakshi
షీనా బోరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా

సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. ఐఎన్ఎక్స్ మీడియా ఆదాయపు పన్ను ఎగవేత, ఇతరత్రా ఆరోపణలపై నమోదైన కేసులకు సంబంధించి విచారణ నిమిత్తం ఇంద్రాణి జ్యుడీషియల్ కస్టడీని 2 వారాలు పొడిగిస్తూ కోర్టు తీర్పిచ్చింది. 

ఈ ఫిబ్రవరి 5న ప్రత్యేక న్యాయస్థానం ఇంద్రాణిని అరెస్ట్ చేయాని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే షీనాబోరా హత్యకేసులో నిందితురాలైన ఇంద్రాణి ఇదివరకే అరెస్టయి ముంబైలోని బైకుల్లా జైల్లో కస్టడీలో ఉంది. ఐఎన్ఎక్స్ మీడియా ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) నియమాలను ఉల్లంఘించి మారిషస్ నుంచి పెట్టుబడులు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి.మనీ లాండరింగ్ విషయంలో ఐఎన్ఎక్స్ మీడియా అధిపతి పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణిపై కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. 

కాగా, 2012 ఏప్రిల్‌ 23న జరిగిన షీనా బోరా హత్యకు గురికాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్ గా మారి షీనా బోరా హత్యకేసు గుట్టు విప్పిన విషయం తెలిసిందే.షీనా బోరా హత్య కుట్రలో సవతి తండ్రి పీటర్‌ ముఖర్జియా పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

మరిన్ని వార్తలు