హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్త హత్య 

8 Jul, 2019 02:24 IST|Sakshi

దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా కత్తులతో దుండగుల దాడి 

పారిశ్రామికవేత్త రాంప్రసాద్‌ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి 

విజయవాడకు చెందిన కోగంటి సత్యంపై ఫిర్యాదు 

సాక్షి, హైదరాబాద్‌/అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: పారిశ్రామికవేత్త తేలప్రోలు రాంప్రసాద్‌ (49) హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురయ్యారు. శనివారం ఆయన దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా పంజగుట్ట వద్ద దుండగులు కత్తులతో పొడిచా రు. తీవ్రగాయాల పాలైన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని భట్టిప్రోలుకు చెందిన రాంప్రసాద్‌ తన ఇద్దరు పిల్లలు అఖిల్, నిహారి, భార్య వైదేహితో కలిసి 2017లో హైదరాబాద్‌కు వచ్చారు. ప్రస్తుతం ఖాజాగూడలో నివాసం ఉంటూ పరిగిలో అభిరాం స్టీల్స్‌ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. సంస్థ కార్పొరేట్‌ కార్యాలయాన్ని పంజ గుట్ట దుర్గానగర్‌లో ఏర్పాటు చేశారు. ప్రతీ శనివారం కార్యాలయం మూసే సమయంలో దాని పక్కనే ఉన్న కళ్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లడం ఆయనకు అలవాటు.

ఈ శనివారంరాత్రి 8:20 సమయంలో దైవదర్శనం అనంతరం బయటకు వచ్చిన సమయంలో అక్కడే కాపుకాసి ఉన్న ముగ్గురు వ్యక్తులు కత్తులతో ఆయనపై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచారు. దీంతో రాంప్రసాద్‌ అక్కడే కుప్పకూలిపోయారు.  అనంతరం దుండగులు కారులో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న రాంప్రసాద్‌ను అంబులెన్స్‌లో సోమాజి గూడ యశోదా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. పోలీసులు ఘటనాస్థలిలో సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఆ కాలనీ మొత్తం చీకటిగా ఉండటంతో నిందితులను స్పష్టంగా గుర్తించలేకపోయారు. కిరాయి హంతకుల పనిగా పోలీసులు నిర్థారించారు. అయితే దుండగులు పారిపోయిన కారు నంబర్‌ గుర్తించారు. ఆ కారు చిత్తూరుకు చెందిన చిరునామాతో ఉంది. కారు నంబర్‌ ప్లేట్‌ మార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

భార్య ఫిర్యాదు మేరకు కేసు..  
రాంప్రసాద్‌ భార్య వైదేహి ఫిర్యాదు మేరకు విజయవాడకు చెందిన కోగంటి సత్యం అనే వ్యక్తిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోగంటి సత్యంతో ఆర్థిక వివాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు వైదేహి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సత్యంపై ఐపీసీ సెక్షన్‌ 302 కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు నిమిత్తం విజయవాడకు ప్రత్యేక బృందాన్ని పంపారు. హత్య జరిగిన సమయానికి కోగంటి సత్యం పంజగుట్ట ప్రాం తంలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. కంపెనీ ఆర్థిక లావాదేవీలు కాస్తా రాజకీయ వైరంగాను మారడంతో రాంప్రసాద్‌ హత్య దర్యాప్తు ఒకే కోణంలో చూడలేమని పోలీసులు చెబుతున్నా రు.  సత్యం ప్రతి వారం పటమట పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉందని, ఈవారం రాకపోవడం తో ఆయన ఎక్కడికి వెళ్లారనేది ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను విచారించామని సీఐ దుర్గారావు తెలిపా రు.  ఆదివారంరాత్రి పంజాగుట్ట పోలీసులు సత్యం పెద్ద అల్లుడు పొచంపల్లి కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసి, విచారణ కోసం హైదరాబాద్‌కు తరలించారు.
 
బొండా ఉమా భాగస్వామి.. 
కోగంటి సత్యం ఎండీగా ఉంటూ కామాక్షి స్టీల్‌ ట్రేడర్స్‌ పేరుతో విజయవాడలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. 2008లో ఈ సంస్థలో రాంప్రసాద్‌తో పాటు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తదితరులు కూడా భాగస్వామిగా ఉండేవారు. 2013లో వ్యాపార లావాదేవీల్లో తేడాలు రావడంతో రాంప్రసాద్, బొండా ఉమ బయటకు వెళ్లిపోయారు. బొండా ఉమా, రాంప్రసాద్‌ తనను మోసం చేశారని కోగంటి సత్యం అప్పట్లో ఆరోపించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో రాంప్రసాద్, సత్యం విజయవాడలోని కృష్ణలంకలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. బొండా ఉమా సహకారంతో రాంప్రసాద్‌ కిడ్నాప్‌ కేసు పెట్టారని సత్యం ఆరోపించారు. అప్పట్లో సత్యంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోగంటి సత్యంపై రౌడీషీట్‌ కూడా తెరిచారు.  

పథకం ప్రకారం నన్ను ఇరికిస్తున్నారు 
‘‘రాంప్రసాద్‌ హత్యతో నాకు సంబంధం లేదు. పథకం ప్రకారం కొందరు నన్ను ఈ కేసులో ఇరికిస్తున్నారు. నాపై రాంప్రసాద్‌ కుటుంబం ఆరోపణలు చేయడం వెనుక టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేను బొండా ఉమాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్లే ఆయన కక్షగట్టారు. కామాక్షి స్టీల్స్‌లో నాతో పాటు బొండా ఉమా కూడ వ్యాపార భాగస్వామిగా ఉండేవారు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు బొండా ఉమ తన వాటా కింద ఉన్న షేర్లను రాంప్రసాద్‌కు విక్రయించారు. రాంప్రసాద్‌ నాకే రూ. 26 కోట్లు ఇవ్వాలి. రాంప్రసాద్‌ను చంపితే నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? డబ్బులు అడిగినప్పుడల్లా నాపై తప్పుడు కేసులు పెట్టారు. ఈ రోజు ఉదయం టీవీలో వార్తలు చూసే వరకూ కూడ రాంప్రసాద్‌ హత్యకు గురైన విషయం నాకు తెలియదు. రాంప్రసాద్‌కు అతని బావమరిదితో కూడ గొడవలున్నాయి. చాలా మందికి రాంప్రసాద్‌ డబ్బులు ఇవ్వాలి. మూడు రోజుల క్రితం నేను తిరుపతికి వెళ్లాను. అక్కడి నుంచి ఫిజియోథెరపీ చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాను. హత్య విషయంలో తెలంగాణ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తాను. ఎక్కడికి నేను పారిపోలేదు. అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేయాలి’’. – మీడియాతో కోగంటి సత్యం. 
 

మరిన్ని వార్తలు