పొదల్లో పసికందు

2 Oct, 2019 10:47 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందు  

సాక్షి, మచిలీపట్నం(కృష్ణా) : కృష్ణా జిల్లా మచిలీపట్నం నడిబొడ్డున పొదల్లో ఏడు నెలల శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపోయారు. అటుగా వెళ్తున్న బేబీరాణి అనే మహిళ ఆ పసికందును చూసి, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి చికిత్స కోసమని హుటాహుటిన తీసుకెళ్లింది. ఎస్‌ఎన్‌సీయూ విభాగంలోని వైద్యులు వెంకటేశ్వరరావు శిశువుకు తక్షణమే వైద్య సేవలు అందించారు. వాస్తవంగా పుట్టిన శిశువు 2.5 కేజీల బరువు ఉండాలి. కానీ ఆ పసికందు కేవలం 950 గ్రాముల బరువు మాత్రమే ఉందని డాక్టర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. నెలలు నిండకుండా పుట్టినందున శ్వాస తీసుకోవటం కష్టంగా ఉందని, అందుకనే మెరుగైన వైద్యం కోసమని విజయవాడ తరలిస్తున్నట్లుగా చెప్పారు. విషయం తెలుసుకున్న చిలకలపూడి పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. శిశువును తీసుకొచ్చిన బేబీరాణి నుంచి వివరాలు సేకరించారు. ఆడపిల్ల కావటంతో ఎవరైనా వదిలేశారా..? లేక మరెవరైనా గుట్టుచప్పుడు కాకుండా బిడ్డను వదిలించుకోవడానికి ఇటువంటి పనికి పాల్పడ్డారా అనేది పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు