పసిపాపను బలిగొన్న ఇంజెక్షన్‌ 

12 Oct, 2017 03:10 IST|Sakshi

మృతదేహంతో రోడ్డుపై ఆందోళన.. పరారీలో ఆస్పత్రి సిబ్బంది

ఇల్లందకుంట(హుజూరాబాద్‌): ఇంజెక్షన్‌ వికటించి 45 రోజుల చిన్నారి బుధవారం మృతి చెందింది. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంటలో నివాసముంటున్న అప్పాల విజయ్‌–హారిక దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కూతురు రియా. చిన్నమ్మాయి 45 రోజుల పసికందు. రోజూ అంగన్‌వాడీ సెంటర్‌లో సరుకులు తీసుకునేందుకు తల్లి హారిక వెళ్తుంది. ఈ క్రమంలో బుధవారం ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఆశ కార్యకర్త చిన్నారికి ఇంజెక్షన్‌ ఇవ్వాలని, తీసుకురావాలని తెలిపింది. దీంతో తల్లి హారిక పాపను ఆస్పత్రికి వెళ్లింది. మొదట సులోచన అనే ఆశ కార్యకర్త పోలియో చుక్కలను వేసింది. తర్వాత రెండో ఏఎన్‌ఎంలు సునీత, అరుణ పెంటావ్యాక్సినేషన్‌ చేశారు. అప్పటికి పాప ఏడుస్తుండటంతో ఏమీ కాదంటూ ఇంజెక్షన్‌ చేశారు.

ఇంటికి తీసుకొచ్చాక కొద్దిసేపటికి∙పాపలో చలనం లేకపోవడంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసు కెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. తన పాప మృతికి కారణం వైద్య సిబ్బందే అంటూ కుటుంబసభ్యులు, కాంగ్రెస్‌ నేతలు, గ్రామస్తులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సిబ్బంది అక్కడి నుంచి పరారయ్యారు. చిన్నారి మృతికి కారణమైన వైద్య సిబ్బందిని తొలగించాలంటూ ఇల్లందకుంట ప్రధాన దారిపై గ్రామస్తులు 2 గంటలపాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జమ్మికుంట సీఐ ప్రశాంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, మూడేళ్ల క్రితం తన పెద్ద కూతురు లక్కీ(రియా)కి కూడా ఇదే ఆస్పత్రిలో ఇంజెక్షన్‌ వికటించిందని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపా యం తప్పిందని తండ్రి విజయ్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు