తొలి రౌండ్‌లోనే విరుచుకుప‌డుతూ కాల్చారు

6 Jul, 2020 13:05 IST|Sakshi

కాన్పూర్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌ర‌డుక‌ట్టిన నేర‌గాడు వికాస్ దూబే అనుచరులు పోలీసుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డిన విష‌యం తెలిసిందే. గురువారం అర్ధ‌రాత్రి నాటి ఈ ఘ‌ట‌న‌లో డీఎస్పీ స‌హా ఎనిమిది మంది పోలీసులు నేల‌కొరిగారు. ఈ ఘోరక‌లి నుంచి గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ బిథూర్ పోలీస్ స్టేష‌న్ ఎస్సై పోలీస్ కౌశ‌లేంద్ర ప్ర‌తాప్ ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్ర‌మాదం జ‌రిగిన రోజు అస‌లేం జ‌రిగింద‌న్న విష‌యాన్ని సోమ‌వారం ఆయ‌న వివ‌రించారు. "హిస్ట‌రీ షీట‌ర్‌ వికాస్ దూబే ఇంటి ద‌గ్గ‌ర రోడ్డు బ్లాక్ చేసి ఉంది. దీంతో ఆ ఇంటికి 150 నుంచి 200 మీట‌ర్ల దూరంలోనే మా వాహ‌నాల‌ను నిలిపివేశాం. అనంతరం అక్క‌డి నుంచి న‌డుచుకుంటూ అత‌ని ఇంటికి వెళ్లాం. అయితే మేము వ‌స్తున్నామ‌ని ప‌క్కా స‌మాచారం అందుకున్న నేరస్థులు అప్ప‌టికే మాకోసం ఇంటి పైక‌ప్పుపై కాపు కాసి ఉన్నారు. (పోలీసులతో సంబంధాలు.. ఇంట్లో బంకర్‌!)

ఇద్ద‌రు పోలీసులను కాపాడాను
మేము అన్నివైపులా కాల్పులు జ‌రిపాం, కానీ వారు పై నుంచి కాల్పులు జ‌ర‌ప‌డంతో మా వైపు పెద్ద ఎత్తున న‌ష్టం సంభ‌వించింది. దీంతో మమ్మ‌ల్ని మేము ర‌క్షించుకునేందుకు ప‌రిగెత్తాం. వారిపై తిరుగు కాల్పుల‌తో జ‌రిపేందుకు ప్ర‌య‌త్నించాం కానీ, వారు ఇంటిపై ఉండ‌టంతో స‌రిగా గుర్తించ‌లేకపోయాం. అప్ప‌టికే వాళ్లు తీవ్ర‌స్థాయిలో కాల్పుల‌కు ఎగ‌బ‌డ‌టంతో మొద‌టి రౌండ్‌లోనే చాలామంది పోలీసులు గాయ‌ప‌డ్డారు. నాతో ఉన్న ఇద్ద‌రు పోలీసులు కూడా గాయ‌ప‌డ‌టంతో వారిని ర‌క్షించ‌డం నా బాధ్య‌త‌గా భావించి అతిక‌ష్టం మీద వారిని అక్క‌డ నుంచి బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చాను" అని తెలిపారు. మ‌రోవైపు వికాస్ దూబేకు స‌హ‌క‌రిస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న పోలీసుల‌పై స‌స్పెన్ష‌న్ వేటు విధించారు. కాగా ప్రధాన నిందితుడు వికాస్‌ దూబేపై ఇప్ప‌టికే 60 కేసులు న‌మోదై ఉన్నాయి. అత‌డి త‌ల‌పై ఉన్న లక్ష రూపాయ‌ల రివార్డును తాజాగా రెండున్నర లక్షలకు పెంచారు. అంతకుముందు 50 వేల రూపాయలుగా ఉన్న రివార్డును ఆదివారం లక్షకు పెంచిన సంగతి తెలిసిందే. (ఉత్తరప్రదేశ్‌లో ఘోరం)

మరిన్ని వార్తలు