పోలీసు లాఠీలకు ఓటరు బలి

9 Dec, 2018 05:34 IST|Sakshi
చందూ నాయక్‌ మృతదేహం

మూత్రపిండాలు దెబ్బతినడంతో గిరిజనుడి మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘటన

మన్ననూర్‌ (అచ్చంపేట): పోలీసులు అత్యుత్సాహంతో చేసిన లాఠీచార్జిలో గాయపడిన ఓ గిరిజన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌ ఉమామహేశ్వర కాలనీకి చెందిన చందూ నాయక్‌ (40) భార్య, ముగ్గురు పిల్లలతో కలసి హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఓటు వేసేందుకు శుక్రవారం ఆయన కుటుంబంతో కలసి గ్రామానికి వచ్చాడు.

ఆయన ఓటు వేసేందుకు ఉదయం పోలింగ్‌ కేంద్రానికి ఆయన వచ్చిన సమయంలో... గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొందని ఓ ప్రధాన పార్టీ నాయకుడు పోలీసులకు తప్పుడు సమాచారం చేరవేశాడు. దీంతో సీఐ లాఠీచార్జికి ఆదేశాలు జారీ చేయగా.. సివిల్‌ పోలీసులతో పాటు స్పెషల్‌ పార్టీ పోలీసులు అక్కడ ఉన్నవారిపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పోలీసులు సుమారు 20 మంది ఓటర్లను చితకబాదారు. వీరిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా చందూ నాయక్‌తో పాటు జెన్‌కో ఉద్యోగి వెంకటయ్య కూడా తీవ్రంగా గాయపడ్డారు. చందూను ఆస్పత్రికి తరలించగా.. మూత్రపిండాలు దెబ్బతిన్నాయంటూ వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన మృతి చెందాడు.
 

మరిన్ని వార్తలు