పిచ్చికుక్క స్వైరవిహారం  

30 Jun, 2018 11:00 IST|Sakshi
ముఖానికి తీవ్రగాయాలతో తలగాన రోహిత్‌  

ఆరుగురిని గాయపరిచిన శునకం

ఒకరి ముఖంపై తీవ్ర గాయాలు

కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 18వ వార్డులో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. సాయంత్ర సమయంలో ఆడుకుంటున్న ఆరుగురు చిన్నారులపై దాడి చేసింది. ఇందులో ఒక బాలుడికి ముఖం నిండా తీవ్ర గాయాలయ్యాయి. 18వవార్డు ఎల్లమ్మవీధికి చెందిన పలువురు చిన్నారులు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు స్కూలు నుంచి వచ్చి ఆడుకునేందుకు పార్కు వద్దకు చేరుకున్నారు.

ఇంతలో అక్కడకు వచ్చిన పిచ్చికుక్క వీరిపై అమాంతం విరుచుకుపడింది. పురుషోత్తపురానికి చెందిన తలగాన రోహిత్‌ ముఖంపై తీవ్ర గాయాలు చేసింది. నుదురు, పెదవులపై దాడి చేసింది. పలాస కాపు వీధికి చెందిన డబ్బీరు ధనుకు చేతి ముక్క పీకేసింది. ధను అన్నయ్య డబ్బీరు దుష్యంత్‌పై దాడి చేసినా స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు.

వీరితో పాటు సాయమ్మ, రోహిణి, హేమసుందర్‌ బెహరాకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే హుటాహుటిన పలాస ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లారు. కుక్కకాటు సంబంధించిన వ్యాక్సిన్‌ ఆస్పత్రిలో లేకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరితో పాటు వైద్యులు కూడా లేకపోవడంతో శ్రీకాకుళం వెళ్లి వైద్యం చేయించుకోవాలని సిబ్బంది సూచించారు.

రోహిత్‌ పరిస్థితి తీవ్రంగా ఉండటంతో తల్లిదండ్రులు గంగాధర్, స్వాతి వెంటనే శ్రీకాకుళం తీసుకెళ్లారు. వ్యాక్సిన్‌ లేకపోవడంతో కొందరు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లిపోయారు. మరికొందరు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మున్సిపాలిటీలో కుక్కలు అధికంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కుక్కల నిర్మూలనకు రూ.4లక్షలు ఖర్చు చూపించినా దస్త్రాలకే పరిమితం అయ్యాయి.

మరిన్ని వార్తలు