నిజాలు నిగ్గుతేలేనా..?

2 Nov, 2017 13:59 IST|Sakshi
శివశాంతి (ఫైల్‌)

ఇంటర్‌ విద్యార్థిని శివశాంతి మృతిపై ముందుకుసాగని  దర్యాప్తు

కేసు నీరుగార్చేందుకు కళాశాల యాజమాన్యం విశ్వప్రయత్నం

నిజనిర్ధారణ కమిటీకి పొంతనలేని సమాధానాలు

మానవహక్కుల కమిషన్‌ ఆశ్రయించనున్న కుటుంబ సభ్యులు

వనపర్తి విద్యావిభాగం: జిల్లా కేంద్రంలోని జాగృతి కళాశాలలో గతనెల 13వ తేదీన అనుమానాస్పదంగా మృతిచెందిన శివశాంతి మృతిపై దర్యాప్తు ముందుకుసాగడం లేదు. సంఘటన జరిగి ఇరవై రోజులు గడుస్తున్నా.. పోలీసుల దర్యాప్తులో పురోగతి కనిపించడంలేదు. ఓ వైపు పోలీసులు విచారణ పేరుతో సమయాన్ని సాగదీస్తుండగా మరోవైపు కళాశాల యాజమాన్యం కేసును నీరుగార్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తాజాగా బుధవారం శివశాంతి అనుమానాస్పద మృతి సంఘటన వివరాలను తెలుసుకునేందుకు వెళ్లిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులకు యాజమాన్యాలు పొంతనలేని సమాధానాలు చెప్పి అనేక అనుమానాలకు తెరలేపారు. పైగా ఈ సంఘటనపై విచారణ జరుగుతోందని, పూర్తి వివరాలు పోలీసుల వద్ద తెలుసుకోవాలని ఉచిత సలహా ఇవ్వడంపై కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
పొంతనలేని సమాధానాలు
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బృందం నిజనిర్ధారణ చేసుకునేందుకు బుధవారం కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా యాజమాన్యాన్ని విద్యార్థిని మృతిపై ప్రశ్నించారు. శివశాంతి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మొదట ఎవరు చూశారు..? ఏ సమయంలో చూశారు..? ఎవరికి సమాచారం ఇచ్చారు. ఫ్యాన్‌కు ఉరేసుకుందనుకుంటే చున్నీని ఎవరు విప్పారు..? ఆ సమయంలో కేవలం మెడ భాగాన్ని మాత్రమే విప్పారా..? లేక ఫ్యాన్‌ పైభాగంలోని ముడిని కూడా విప్పారా..? పోలీసులకు ఏ సమయంలో సమాచారం ఇచ్చారు..? ఏరీయా ఆస్పత్రికి తరలించిన సమయానికి మృతిచెంది ఉందా..? వంటి ప్రశ్నలను అడిగారు. యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెప్పకపోవడాన్ని కమిటీ సభ్యులు గుర్తించారు.  

కనిపించని పురోగతి
శివశాంతి మృతి కేసును నీరుగార్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కళాశాల తరగతి గదిలో ఉరివేసుకుని మృతిచెందిందని యాజమాన్యం చెబుతున్నా.. ఏ కారణంతో ఉరి వేసుకుందనే విషయాన్ని నేటికి బహిర్గతం చేయడం లేదంటున్నారు. పోలీసులు సైతం కేవలం అనుమానాస్పద మృతిగా 174 సీఆర్‌పీసీ సెక్షన్‌ ప్రకారం (ఎఫ్‌ఐఆర్‌ నెం.255/2017) కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. విచారణ పేరుతో కాలాన్ని సాగదీస్తున్నారేగాని ఇంతవరకు ఈ కేసు విషయంలో ఎలాంటి పురోగతిలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని.. హత్యేనని ఈ కేసు విషయంలో న్యాయం చేయాలని ప్రజావాణిలో కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.

కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు
మృతి సంఘటన జరిగినప్పటి నుంచి కేసును నీరుగార్చేందుకు కళాశాల యాజమాన్యం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్న విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లాకేంద్రానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి యాజమాన్యం తరఫున పోలీసులతో చర్చించి మా సామాజిక వర్గానికి చెందినవారే కాబట్టి సెటిల్‌మెంట్‌ చేయిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం రూ.4లక్షలు పరిహారంగా చెల్లిస్తారని రూ.లక్ష అడ్వాన్స్‌గా చెల్లిస్తామని, మిగిలిన రూ.3లక్షలకు చెక్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అగ్రిమెంట్‌పై సం తకాలు చేయాలని కుటుంబీకులతపై ఒత్తిడి తీసుకువచ్చా రు. కాని తమ కూతురు మృతికి కారకులైన వారికి ఖచ్చితం గా శిక్షపడాలని తేల్చి చెప్పడంతో సెటిల్‌మెంట్‌ కుదరలేదు.

మరిన్ని వార్తలు