హత్య వెనుక ప్రేమ వ్యవహారం

5 Apr, 2020 13:44 IST|Sakshi
ప్రదీప్‌రెడ్డి, రమేష్‌ వివరాలు వెల్లడిస్తున్న  ఇన్‌స్పెక్టర్‌ దయాకర్‌ 

ఆనంద్‌రెడ్డి హత్య కేసులో సూత్రధారి, డ్రైవర్‌ అరెస్టు

వివరాలు వెల్లడించిన హన్మకొండ ఇన్‌స్పెక్టర్‌ దయాకర్

ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించడంతో విబేధాలు

సాక్షి, కాజీపేట: ఖమ్మం అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్, జనగామ జిల్లాకు చెందిన మోకు ఆనంద్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు, సూత్రధారి పింగిళి ప్రదీప్‌రెడ్డితో పాటు డ్రైవర్‌ రమేష్‌ హన్మకొండ పోలీసులకు శనివారం చిక్కారు. ఈ మేరకు వివరాలను హన్మకొండ ఇన్‌స్పెక్టర్‌ పి.దయాకర్‌ సాయంత్రం వెల్లడించారు. హన్మకొండ గోపాలపురంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పింగిళి ప్రదీప్‌రెడ్డి, డ్రైవర్‌ నిగ్గుల రమేష్‌ ఇన్నోవా క్రిస్టా వాహనంలో వెళ్తుండడాన్ని గుర్తించారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. (లేబర్‌ ఆఫీసర్‌ ఆనంద్‌రెడ్డి దారుణ హత్య)

గత నెల 7న హత్య
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రామారం అడవుల్లోని గట్టమ్మ గుడి వద్ద గత నెల 7వ తేదీన ఆనంద్‌రెడ్డిని పింగిళి ప్రదీప్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, శివరామకృష్ణ, శంకర్, మధుకర్, రమేష్‌ కలిసి హత్య చేసిన విషయం విదితమే. అదే నెల 8వ తేదీన ఆనంద్‌రెడ్డి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 11వ తేదీన ముగ్గురు నిందితులు శివరామకృష్ణ, మధుకర్, శంకర్‌ను అరెస్ట్‌ చేశారు. మిగిలిన వారిలో ప్రధాన నిందితుడు ప్రదీప్‌రెడ్డితో పాటు విక్రమ్‌రెడ్డి, రమేష్‌ హైదరాబాద్‌కు పారిపోయినట్లు గుర్తించి గాలింపు చేపట్టారు. ఇందులో విక్రమ్‌రెడ్డిని మార్చి 28న అరెస్టు చేయగా.. ఇప్పుడు ప్రదీప్‌రెడ్డి, రమేష్‌ను కూడా అరెస్టు చేయడంతో ఘటనలో నిందితులందరూ పట్టుబడినట్లయింది.

హత్య వెనుక ప్రేమ వ్యవహారం
ఆనంద్‌రెడ్డి – ప్రదీప్‌రెడ్డి నడుమ ఇసుక వ్యాపారంలో లావాదేవీలు కొనసాగాయని తొలుత ప్రచారం జరిగింది. ఈ మేరకు ఆనంద్‌రెడ్డికి ప్రదీప్‌రెడ్డి రూ.80లక్షల మేర బాకీ పడడంతో హత్య చేసినట్లు అందరూ భావించారు. కానీ పోలీసుల విచారణలో కొత్త కోణం బయటపడింది. కరీంనగర్‌కు చెందిన ఓ యువతితో ప్రదీప్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి వేర్వేరుగా ప్రేమ వ్యవహరం నడపగా.. ఆమెను దక్కించుకునే క్రమంలో వచ్చిన విబేధాలతో ఆనంద్‌రెడ్డిని హతమార్చినట్లు ప్రదీప్‌రెడ్డి ఒప్పుకున్నాడని ఇన్‌స్పెక్టర్‌ దయాకర్‌ తెలిపారు.
 

మరిన్ని వార్తలు