యూపీలో రెచ్చిపోయిన గోరక్షక ముఠా

4 Dec, 2018 04:08 IST|Sakshi
బులంద్‌షహర్‌లో వాహనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. సీఐ సుబోధ్‌ (ఫైల్‌)

పోలీస్‌పోస్ట్‌పై దాడి

ఇన్‌స్పెక్టర్‌సహా ఇద్దరు మృతి

బులంద్‌షహర్‌: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గోరక్షక ముఠా రెచ్చిపోయింది. ఓ మతానికి చెందిన ప్రజలు ఆవును చంపేశారని ఆరోపిస్తూ రోడ్డును దిగ్బంధించి ఆందోళనకు దిగింది. ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి అక్కడకు చేరుకున్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా స్థానిక పోలీస్‌ ఔట్‌పోస్ట్‌తో  పాటు పలు వాహనాలకు నిప్పంటించింది. ఈ ఘటనలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. మీరట్‌ జోన్‌ అదనపు డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘బులంద్‌ షహర్‌ జిల్లా మెహౌ గ్రామం దగ్గర సోమవారం ఆవు కళేబరం కనిపించింది.

దీంతో ఓ మతానికి చెందినవారు ఆవును చంపేశారని ఆరోపిస్తూ హిందుత్వ సంస్థల సభ్యులు కొందరు ఆ ఎముకల్ని ట్రాక్టర్‌లో వేసుకుని ఛింగర్వతి పోలీస్‌స్టేషన్‌ దగ్గరకు తీసుకొచ్చారు. తర్వాత బులంద్‌షెహర్‌–గఢ్‌ రాష్ట్ర రహదారిని దిగ్బంధించారు. దీంతో జిల్లా కలెక్టర్‌ అనూజ్‌ కుమార్, సబ్‌డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ అవినాశ్‌ కుమార్‌ రంగంలోకి దిగి ఆందోళనకారులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. అంతలోనే ఒక్కసారిగా రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీస్‌ ఔట్‌పోస్ట్‌తో పాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా దుండగుల దాడిలో ఇన్‌స్పెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ మరణించారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమిత్‌ అనే యువకుడు చనిపోయాడు.
 

మరిన్ని వార్తలు