గంజాయి కోసం గతి తప్పారు!

22 Mar, 2019 06:52 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు, స్వాధీనం చేసుకున్న బైక్‌లు

ఆ నిషాలో మళ్లీ నేరాలు  

కటకటాల్లోకి నలుగురు విద్యార్థులు  

ప్రతి ఒక్కరికీ గతంలోనూ నేరచరిత్ర

సాక్షి, సిటీబ్యూరో: గంజాయి... ఎంజాయ్‌... ఈ రెండు ఆ విద్యార్థులను గతి తప్పేలా చేశాయి. డిగ్రీ, ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఆ నలుగురూ జట్టు కట్టారు. మత్తు కోసం నేరాలు చేస్తూ.. ఆ నిషాలో స్నాచింగ్స్‌కు పాల్పడుతున్నారు...ఈ గ్యాంగ్‌ గుట్టురట్టు చేసిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ నలుగురు విద్యార్థుల్లో ఒక్కొక్కరిపై ఒకటి నుంచి 17 కేసులు ఉండటం గమనార్హం. డీసీపీ రాధాకిషన్‌రావు గురువారం కేసు వివరాలు వెల్లడించారు. 

ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువు...
మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన, ప్రస్తుతం కొత్తపేటలో నివసిస్తున్న అరుణ్‌కుమార్‌ తండ్రి ఆర్మీలో పని చేస్తున్నారు. అలాగే నెల్లూరు నుంచి వచ్చి బోయిన్‌పల్లిలో స్థిరపడిన రామ్‌కోటి అఖిల్‌కుమార్‌ తండ్రి నేవీలో పని చేసేవారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పని చేసే విద్యా సంస్థలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివారు. అక్కడే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం అరుణ్‌ సికింద్రాబాద్‌లోని ఓ ప్రతిష్టాత్మక సంస్థలో డిగ్రీ, అఖిల్‌ మరో సంస్థలో ఇంటర్మీడియేట్‌ చదువుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చి మౌలాలీలో ఉంటున్న మనీష్‌ ఉపాధ్యాయ, తుకారామ్‌ గేట్‌కు చెందిన సంజయ్‌ సింగ్‌ ఓ విద్యా సంస్థలో ఇంటర్మీడియేట్‌ చదువుతున్నారు.

గంజాయి నేపథ్యంలో పరిచయం...
ఈ నలుగురూ సికింద్రాబాద్‌ సమీపంలోని ఓ ప్రాంతంలో గంజాయి తాగేవారు. అక్కడే అరుణ్, అఖిల్‌లకు మిగిలిన ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ఓ దశలో మత్తుకు పూర్తిగా బానిసలైన వీరికి గంజాయి కొనుగోలు చేసేందుకు డబ్బు అందుబాటులో ఉండేది కాదు. దీనికితోడు తల్లిదండ్రులను అడిగి తీసుకోలేని పరిస్థితి. దీంతో నేరాలు చేయడం ద్వారా తేలిగ్గా డబ్బు సంపాదించే అవకాశం ఉందని అరుణ్‌ సలహా ఇవ్వడంతో మిగిలిన ముగ్గురూ అంగీకరించారు. దీంతో కొన్నాళ్లుగా ఎవరికి వారుగా, ఒక్కోసారి ముఠాగా నేరాలు చేయడం మొదలెట్టారు. నల్లకుంట, బేగంపేట, మహంకాళి, ఉస్మానియా వర్శిటీ, మల్కాజ్‌గిరి, తుకారామ్‌గేట్, మారేడ్‌పల్లి, నేరేడ్‌మెట్, కుషాయిగూడ, సికింద్రాబాద్‌ గవర్నమెంట్‌ రైల్వే పోలీసు ఠాణాల్లో అరుణ్‌పై 11, మనీష్‌పై 10, సంజయ్‌పై 17, అఖిల్‌పై ఒక కేసు నమోదయ్యాయి. పలుమార్లు కటకటాల్లోకి వెళ్లి వచ్చినా వీరి బుద్ధిమారలేదు. 

బైక్‌లు కొట్టేసి స్నాచింగ్‌లు చేస్తూ...  
గత ఏడాదిగా ఈ నలుగురూ రెండు రకాలైన దొంగతనాలు మొదలెట్టారు. పార్కింగ్‌ కాంప్లెక్స్‌లు, మెట్రో స్టేషన్లు వద్ద సంచరిస్తూ అదును చూసుకుని వాటిలో ఉన్న ద్విచక్ర వాహనాలు ఎత్తుకుపోయే వారు. వాటిపై తిరుగుతూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలో నుంచి పుస్తెల తాళ్లు, పురుషుల నుంచి సెల్‌ఫోన్లు లాక్కెళ్లేవారు. ఇలా చిలకలగూడలో చైన్, సెల్‌ఫోన్‌ స్నాచింగ్, గోల్కొండ, మారేడ్‌పల్లి, ఉస్మానియా యూనివర్శిటీ, చిలకలగూడల్లో ద్విచక్ర వాహనాలు,  మేడిపల్లిలో స్నాచింగ్స్‌తో పాటు ఓ ఇంట్లో చోరీ, చిలకలగూడ, నేరేడ్‌మెట్‌ల్లో స్నాచింగ్స్‌కు యత్నాలు చేయడంతో కేసులు నమోదయ్యాయి. దొంగిలించిన వాహనాలు, బంగారాన్ని పరిచయస్తులకే తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునే వారు. వీరు చేసిన నేరాల్లో అత్యధికం గంజాయి మత్తులోనే చేయడం గమనార్హం.

వలపన్ని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌...
ఈ నలుగురి ముఠా ఆరు ఠాణాల పరిధిలో ఎనిమిది నేరాలు చేయడంతో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్పైలు కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, కేఎస్‌ రవి, జి.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన బృందం వీరి కదలికలపై నిఘా ఏర్పాటు చేసింది. ఆయా నేరాలు జరిగిన ప్రాంతాల్లో 200 సీసీ కెమెరాల నుంచి ఆయా సమయాల్లో రికార్డైన ఫీడ్‌ను సేకరించి అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలోనే నిందితుల ఆచూకీ టాస్క్‌ఫోర్స్‌కు లభించింది. దీంతో వలపన్నిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ వలపన్ని గురువారం ఈ నలుగురినీ అదుపులోకి తీసుకుంది. లోతుగా విచారించగా నేరాలు అంగీకరించారు. దీంతో నాలుగు ద్విచక్ర వాహనాలు, 10 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు