కులాంతర ప్రేమ వివాహం రేపిన చిచ్చు!

11 Mar, 2020 12:10 IST|Sakshi

ఓ జంట కులాంతర ప్రేమ వివాహం ఇరు సామాజిక వర్గాల మధ్య చిచ్చు రేపింది. ప్రియురాలి కుటుంబం ప్రియుడి మీద కనెర్ర జేసింది. ప్రియుడితో పాటు అతడికి సహకరించిన ఓ రాజకీయ పార్టీ నాయకుడ్ని కిడ్నాప్‌ చేసి చిత్ర హింసలకు గురిచేసింది. సినీ తరహాలో సాగిన ఈ పరిణామాల సమాచారంతో పోలీసులు సకాలంలో స్పందించారు. ఇద్దర్ని రక్షించారు.  

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఇటీవల కులాంతర ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారితీస్తున్నాయి. పెద్దల పరువుకు, కుల చిచ్చుకు ఇప్పటి వరకు వంద మంది వరకు పరువు హత్యలకు గురైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని వెలుగులోకి రాగా, మరికొన్ని చాపకింద నీరులా చతికిలపడిపోయాయి. ఈ పరువు హత్యలను మద్రాసు హైకోర్టు సైతం తీవ్రంగా పరిగణించింది. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే దంపతులకు తాము అండగా ఉంటామన్నట్టుగా భరోసా ఇచ్చి ఉంది. పరువు హత్యల కట్టడి లక్ష్యంగా ప్రత్యేక చట్టం తీసుకొచ్చే రీతిలో పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించింది. ఇందుకుగాను ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ఆదేశాల్ని ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో సేలంలో సోమవారం రాత్రి జరిగిన ఓ కులాంతర వివాహం ఇరు సామాజిక వర్గాల మధ్య చిచ్చురేపింది. పోలీసులు సకాలంలో స్పందించడం వివాదం స్థానికంగానే పరిమితమైంది.  

ప్రేమ వివాహం... 
ఈరోడ్‌ జిల్లా భవానికి చెందిన సెల్వం, ఇలమది వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వాళ్లు. ఈ ఇద్దరూ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చిన ఈ జంట కులాంతర వివాహానికి సిద్ధమైంది. సేలం మేట్టురు సమీపంలో సోమవారం సెల్వం, ఇలమదికి ద్రావిడ విడుదలై ఇయక్కం స్థానిక నాయకుడు ఈశ్వరన్‌ సమక్షంలో కులాంతర వివాహం జరిగింది. వివాహం ముగియడంతో ఎవరికి వారు తమ ఇళ్లకు వెళ్లారు. రాత్రి సమయంలో సినీ తరహాలో కార్లు వచ్చి ఈశ్వరన్‌ ఇంటి ముందు ఆగాయి. వచ్చీ రాగానే, పదుల సంఖ్యలో వ్యక్తులు ఆయన మీద దాడి చేశారు. అనంతరం అతడిని కిడ్నాప్‌ చేశారు. అక్కడి సీసీటీవీలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి.

ఈ క్రమంలో కొత్త జంట వీరి నుంచి తప్పించుకుని పోలీసుల్ని ఆశ్రయించేందుకు మోటారు సైకిల్‌ మీద ఉరకలు తీసింది. సినీ తరహాలో ఆ జంటను ఛేజింగ్‌ చేసిన ఆ ముఠా, వారిని కూడా కిడ్నాప్‌ చేసింది. అస్సలు ఏమి జరుగుతుందో అన్న టెన్షన్‌ ఓ వైపు పెరగడంతో పెరియార్‌ ద్రావిడర్‌ ఇయక్కం వర్గాలు కొళత్తూరు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కరుంగళ్లు వద్ద ఓ కారును పట్టుకున్నారు. అందులో ఇలమది తండ్రి జగన్నాథన్‌ ఉండడంతో వివాదం ముదిరింది. కులాంతర వివాహం చేసుకున్న ఆ జంటను, ఈశ్వరన్‌ను జగన్నాథన్‌ కిడ్నాప్‌ చేసిన సమాచారంతో ఆ పరిసరాల్లో టెన్షన్‌ బయలు దేరింది. ఇరు సామాజిక వర్గాల మధ్య వివాదం రేగింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.  

ఇద్దరి రక్షింపు  
జగన్నాథన్‌ వద్ద జరిపిన విచారణతో మూడు వేర్వేరు కార్లలో వేర్వేరు మార్గాల్లో ఈశ్వరన్, ఇలమది, సెల్వన్‌ను తరలించినట్టు తేలింది. అర్ధరాత్రి వేళ పోలీసులు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ చేపట్టారు. చివరకు మంగళవారం వేకువ జామున ఈశ్వరన్, సెల్వంను రక్షించారు. ఆ ఇద్దర్నీ ప్రథమ చికిత్స అనంతరం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారికి రక్షణ కల్పించారు. ఇలమది సమాచారం తెలియక పోవడంతో ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమెను ఎక్కడికి తరలించారో అన్న విషయాన్ని జగన్నాథన్‌ చెప్పక పోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.  తన భార్యకు ప్రాణహాని ఉందని, ఆమెను రక్షించాలని సెల్వం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈశ్వరన్‌ పార్టీ వర్గీయులు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో ఈ వ్యవహారం ముదరకుండా చాకచక్యంగా వ్యవహరించి ఇలమదిని రక్షించేందుకు తగ్గట్టుగా ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగింది.  
 

మరిన్ని వార్తలు