మాటల మాయగాడు... మోసాల మొనగాడు

21 May, 2020 12:24 IST|Sakshi

ప్రజాప్రతినిధులే అతని టార్గెట్‌

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌: అతనో మాటల మాయగాడు... ఎంతటి మాయగాడు అంటే ఎంపీ, ఎమ్మెల్యేలను అవలీలగా బురడీ కొట్టించి రూ.లక్షలు కొల్లగొట్టడంలో సిద్ధహస్తుడు. 12 ఏళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతని మోసాల పరంప కొనసాగుతోంది. అవతలి వారు ఎంతటి వారైనా తన మాటలతో బుట్టలో పడేసే మాటకారి. 30 చీటింగ్‌ కేసుల్లో నిందితుడైన అంతర్రాష్ట సైబర్‌ నేరగాడు. ఈ పన్నెండేళ్లలో రెండు రాష్ట్రాలకు చెందిన 35 మంది ప్రజాప్రతినిధుల నుంచి కోట్లు కొట్టేశాడు. కిర్లంపూడికి చెందిన తోట బాలాజీ నాయుడు (42) పన్నెండేళ్ల నేర ప్రస్థానమిది.  నాయుడు తాజాగా అమలాపురం ప్రజాప్రతినిధికి ఫోన్‌ చేసి మాయ మాటలకు చెప్పి ప్రభుత్వ నిధులు మంజూరు చేయిస్తానని రూ.2 లక్షలు పేటీఎం ద్వారా ఆన్‌లైన్‌లో వేయించుకుని సైబర్‌ నేరానికి పాల్పడ్డాడు.

విషయం తెలసుకున్న ఆ ప్రజా ప్రతినిధి తన వ్యక్తిగత సహాయకుడి చేత అల్లవరం పోలీసు స్టేషన్‌లో నాయుడుపై ఫిర్యాదు చేయించారు. దీంతో అతని నేరాల చిట్టా మరోమారు వెలుగు చూడడమే కాకుండా ఆ నేరగాడిని కటకటాల్లోకి నెట్టించారు. బీటెక్‌ చదవి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్టీపీసీలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగం చేస్తూ సైబర్‌ నేరాల బాట పట్డాడు. పాల్వంచ, కరీంనగర్‌ ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాలంలో నాయుడు లంచం తీసుకుంటూ ఏసీబీ ట్రాప్‌కు చిక్కుకుని సస్పెండయ్యాడు. 2008లో జరిగిన ఏసీబీ ట్రాప్‌ తర్వాత నాయుడి మోసాల చిట్టా తెరుచుకుని నేరాల పరంపర మొదలైంది.

నాయుడి సైబర్‌ నేరాల తీరు ఇలా...
నాయుడు అసలే మాటకారి కావడంతోపాటు ఇంగ్లిషులో మాట్లాడడం... అతని మోసాలకు బాగా ఉపయోగపడ్డాయి. తానో ప్రభుత్వ ఉద్యోగినని పరిచయం చేసుకుంటాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కొన్ని పథకాల పేర్లు చెప్పి ఈ నిధులు ఇంకా ఉన్నాయని... వాస్తవానికి  ఆ పథకాల లబ్ధికి కాల పరమితి ముగిసి పోయినప్పటికీ ముందు డేట్‌ వేసి ఆ నిధులు వచ్చేలా చేస్తానని చెబుతాడు. ఇందుకోసం లబ్ధిదారుల తరఫున కొంత మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుందని... అయితే ఇప్పుడు అంత సమ యం లేదు కాబట్టి మీరే ముందుగా కొంత మొత్తాన్ని జమ చేస్తే నిధులు మంజూరవుతాయని నమ్మబలుకుతాడు. దీంతో ప్రజా ప్రతినిధులు నాయుడు చెప్పిన బ్యాంక్‌ అకౌంట్‌కు డబ్బులు వేస్తారు.

బ్యాంక్‌ అకౌంట్‌ కూడా తనది కాకుండా తనకు తెలిసిన వారిది ఇస్తాడు. ఫోన్లు కూడా వేరొకరి నంబర్ల నుంచి కాల్‌ చేసి మాట్లాడి నేరం బయటకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. ప్రకాశం, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, విజయనగరం, చిత్తూరు తదితర జిల్లాల్లో నా యుడు ప్రజాప్రతినిధులను మోసం చేసి రూ.లక్షలు కాజేశాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో కూడా నాయుడి మోసాలు ఆగలేదు. జిల్లాల సరి హద్దులు దాటుతూ అతడు భీమవరం, కర్నూలు చెక్‌పోస్టుల వద్ద దొరికిపోయి క్వారంటైన్లకు కూ డా వెళ్లాడు. అక్కడ సైతం కొందరి ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి డబ్బులు గుంజాడు. క్వారెంటైన్‌లో ఉన్న నాయుడిని పోలీసులు అక్కడ నుంచి రప్పించి అరెస్ట్‌ చేసి కటకటాలపాల్జేశారు. 

మరిన్ని వార్తలు