ఒడిశా టు మహారాష్ట్ర వయా హైదరాబాద్‌

10 Sep, 2019 11:28 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీపీ మహేష్‌ భగవత్‌

గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు అంతర్రాష్ట ముఠా అరెస్టు

130 కిలోల గంజాయి స్వాధీనం కిలో రూ.2వేలకు కొనుగోలు

రూ.7వేలకు విక్రయం

నేరేడ్‌మెట్‌: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు నుంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా గుట్టును రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు. కొంతకాలంగా తెలంగాణ, మహరాష్ట్ర  కేంద్రంగా గంజాయి దందా చేస్తున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి  çరూ.31.62లక్షల విలువవైన 130 కిలోల గంజాయి,  రెండు కార్లు, ఆరు సెల్‌ఫోన్లు, రూ.12వేల నగదను  స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్‌భగవత్‌ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా, చిన్నగారికుంట తండాకు చెందిన  కారు డ్రైవర్లుగా పని చేస్తున్న బానోతు సుధాకర్, గూడెపుకుంట తండాకు చెందిన జర్పుల హుస్సేన్‌ స్నేహితులు.  వీరు తమ అనుచరులైన జతోత్‌తండాకు చెందిన దరావత్‌ చిరంజీవి అలియాస్‌ రఘు,  మహ్మదాపురానికి చెందిన కంభంపాటి నాగేశ్వర్‌రావు, పెద్దగారికుంటకు చెందిన బానోతు వెంకన్న, చిన్నగారికుంటకు చెందిన బానోతు సురేష్‌ నాయక్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు కొన్ని నెలలుగా గంజాయి అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నారు.

విశాఖపట్నం పరిసరాల్లో చెందిన గంజాయి విక్రేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న వీరు ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని ధారాకొండ నుంచి కిలో రూ.2వేల చొప్పుర గంజాయి కొనుగోలు చేసి, కార్లలో హైదరాబాద్‌లోని దూల్‌పేట్, ఓల్డ్‌సిటీ తదితర ప్రాంతాలతోపాటు మహరాష్ట్రలోని ఏజెంట్‌లకు  కిలో రూ.7వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఏజెంట్లు వాటిని చిన్న ప్యాకెట్లగా మార్చి, యువకులు, విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై సమాచారం అందడంతో సోమవారం ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా వనస్థలిపురం ఠాణా పరిధిలోని ఆటో నగర్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. అటుగా వస్తున్న మహింద్రా టీయూవీ, స్విఫ్ట్‌ టూర్‌ కార్లను ఆపి సోదా చేయగా సీట్లు, డోర్లలో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో ప్రధాన నిందితులు బానోతు సుధాకర్, జర్పుల హుస్సేన్‌లను అరెస్టు చేసిన పోలీసులు వారిచ్చిన సమాచారం అధారంగా దారావత్‌ చిరంజీవి, కంభపాటి నాగేశ్వర్‌రావు, బానోతు వెంకన్న, బానోతు సురేష్‌లను  అరెస్టు చేశారు.

ఎవరినీ వదలిపెట్టం
గంజాయి అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ఎవరినీ వదలిపెట్టమని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  రాచకొండ కమిషనరేట్‌ గంజాయి సాగు లేదన్నారు. ఓఆర్‌ఆర్, ఇతర రాష్ట్రాలకు హైవే కనెక్టివిటీ ఉండటం వల్ల ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన మూడున్నరేళ్లలో 4వేల కిలోల గంజాయిని రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  నార్కోటిక్, డ్రగ్స్‌ ట్రాఫికర్‌ చట్టం కింద గంజాయి వ్యాపారం చేసే వారి ఆస్తిని జప్తు చేయడంతోపాటు పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. గతంలో గంజాయి వ్యాపారం కేసులో కీసరలో రూ.కోటి విలువైన ఆస్తిని జప్తు చేసిన విషయాన్ని సీపీ గుర్తు చేశారు. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 248 కేసుల్లో నిందితులకు శిక్ష పడిందన్నారు. ఇందులో 8మందికి జీవితఖైదు విధించినట్లు సీపీ వివరించారు.  పోలీసులకు క్యాష్‌ రివార్డులు అందజేశారు. సమావేశంలో  ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సురేందర్‌రెడ్డి, సీఐలు రవికుమార్, వెంకటయ్య, ఎస్‌ఐలు వెంకటేశ్వ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. – సీపీ మహేష్‌భగవత్‌

పరారీలో గంజాయి విక్రేత
ధారాకొండకు చెందిన గంజాయి విక్రేత సురేష్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు సురేష్‌ నుంచి గంజాయి కొనుగోలు చేసి, తెలంగాణ, మహరాష్ట్రలకు రవాణా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

మరిన్ని వార్తలు