ఐ–20 పంజా

2 Nov, 2018 09:30 IST|Sakshi

మూడు రోజులు.. మూడు కమిషనరేట్లు.. 16 చోరీలు

మీరట్‌ ముఠాగా గుర్తింపు

సాక్షి, సిటీబ్యూరో: నకిలీ నంబర్‌ ప్లేట్లు తగిలించిన తెల్లరంగు ఐ–20 కారులో సంచరిస్తూ నగరంలో వరుస నేరాలకు పాల్పడుతున్న ఘరానా అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు చిక్కింది. ఈ ఏడాది జూన్‌లో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 16 నేరాలు చేసిన ఈ మీరట్‌ గ్యాంగ్‌ పోలీసులకు సవాల్‌ విసిరింది. మూడు కమిషనరేట్ల పోలీసులూ ఈ దొంగల కోసం ముమ్మరంగా వేట కొనసాగించారు. చివరికి ఎస్సార్‌నగర్‌ పోలీసులు నేరాలకు అసలు సూత్రదారులను పట్టుకుని వీరి అనుచరుల కోసం వేటాడుతున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని వివిధకోణాల్లో ప్రశ్నిస్తున్న అధికారులు ఈ దొంగలు ఎత్తుకుపోయిన సొత్తు రికవరీ పైనా దృష్టి పెట్టారు. 

కారులో వచ్చి పట్టపగలే చోరీలు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఈ గ్యాంగ్‌ లీడర్‌ పేరుమోసిన గజదొంగ. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పంజా విసిరే ఇతడిపై ఉత్తరాది పోలీసులు రూ.10 లక్షల రివార్డ్‌ ప్రకటించారు. ఈ ఏడాది జూన్‌లో హైదరాబాద్‌పై కన్నేసిన ప్రధాన సూత్రదారి నలుగురు ముఠా సభ్యులతో తెల్లరంగు ఐ–20 కారులో రంగంలోకి దిగాడు. తొలిసారి జూన్‌ 25న గుడిమల్కాపూర్‌ నవోదయకాలనీలో గుడి వెనుక ఉన్న తాళంవేసిన ఇంట్లోకి ప్రవేశించి పది తులాల బంగారం, రెండు కిలోల వెండి, రూ.లక్ష నగదు అపహరించుకుపోయాడు. ఆ రోజు కారు వద్ద ముగ్గురు కనిపించారని స్థానికుల ద్వారా పోలీసులు గుర్తించారు.  

సీసీ కెమెరాల ద్వారా కారు గుర్తింపు
ఈ గ్యాంగ్‌ తెల్లని ఐ–20 కారు వినియోగించినట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. చోరీకి ముందు ఆ కారు నాంపల్లి నుంచి ఆసిఫ్‌నగర్‌ వరకు దాదాపు నాలుగు కి.మీ. ప్రయాణించినట్లు రికార్డు ఉంది. నవోదయ కాలనీ కమ్యూనిటీ హాల్‌ ముందు కారును ఆపిన దొంగలు ఏడు నిమిషాలు అక్కడ తచ్చాడారు. అదే సమయంలో కారు నెంబర్‌ ప్లేట్‌ మార్చిన ఆనవాళ్లు రికార్డయ్యాయి. ఇక్కడ నుంచి రాజేంద్రనగర్‌ వెళ్లి అక్కడా చోరీ చేసిన గ్యాంగ్‌ ఆ తర్వాత రెండు రోజుల్లో (జూన్‌ 26, 27 తేదీల్లో) వనస్థలిపురం, మైలార్‌దేవ్‌పల్లి, నార్సింగి, మీర్‌పేట్‌ల్లో మొత్తం 16 ఇళ్లపై పంజా విసిరింది. తర్వాత రెండు రోజులూ (28, 29) చోరీలు నమోదు కాలేదు. మీర్‌పేట్‌ చోరీలో తస్కరించిన లాకర్‌ను ఎత్తుకుపోయిన ఈ గ్యాంగ్‌ బాలాపూర్‌లో పడేసింది. దీంతో వీరు ఆ మార్గంలో సిటీని వదిలి పారిపోయి ఉంటారని పోలీసులు అంచనా వేశారు. 

మీరట్‌ చెందినదిగా గుర్తించినా..
కరడుగట్టిన ఈ ముఠాను పట్టుకోవడానికి సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్స్‌ (ఎస్వోటీ) ముమ్మరంగా ప్రయత్నించాయి. ప్రధానంగా టోల్‌గేట్స్‌పై దృష్టి పెట్టిన పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి వాటి రికార్డులు, సీసీ కెమెరాల ఫీడ్‌ను సేకరించి విశ్లేషించారు. ఈ నేపథ్యంలో అనుమానిత ఐ–20 కారు నిర్మల్‌.. మహారాష్ట్రలోని వార్దా, ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మీదుగా ఢిల్లీ వెళ్లినట్లు గుర్తించారు. అన్ని కోణాల్లో ఆరా తీసిన పోలీసులు ఈ గ్యాంగ్‌ మీరట్‌కు చెందినదిగా తేల్చారు. ఉత్తరప్రదేశ్‌ వెళ్లిన అధికారులు అక్కడి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌) సహకారం తీసుకుని దాదాపు నెల రోజుల పాటు గాలించినా పట్టుకోలేకపోయారు. 

ఎస్సార్‌నగర్‌ పోలీసులకు కలిసొచ్చినగతానుభవం
మీరట్‌ నుంచి స్కార్పియో వాహనంలో వచ్చిన ఓ గ్యాంగ్‌ ఎస్సార్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో పంజా విసిరింది. ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగిన చోరీ కేసును అధ్యయనం చేసిన పోలీసులు దాదాపు 70 సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలించారు. దీంతోపాటు సాంకేతిక ఆధారాలను బట్టి మీరట్‌ గ్యాంగ్‌గా భావించి పట్టుకున్నారు. వీరిని గత ఏడాది జూన్‌ 15న నగరానికి తరలించి అరెస్టు చేశారు. ఈ అనుభవమే తాజా ఐ–20 గ్యాంగ్‌ చిక్కడానికి కారణమైంది. తాజా ముఠా కోసం రంగంలోకి దిగిన ఎస్సార్‌నగర్‌ పోలీసులు వారు నేరం చేసే తీరు, రోజులు తదితరాలను విశ్లేషించారు. దీనికి తోడు సాంకేతికంగానూ ముందుకు వెళ్లిన అధికారులు ఈ అంతరాష్ట్ర దొంగలు మరోసారి నేరం చేయడానికి సిటీకి వస్తున్నట్లు గుర్తించారు. కారు తీసుకుని రోడ్డు మార్గంలో కొందరు, రైలులో మరికొందరు వస్తున్నట్లు నిర్థారించారు. దీంతో వలపన్నిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దొంగలను ప్రస్తుతం ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు.  

మరిన్ని వార్తలు